జర్నలిస్టుల పేరిట ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హెచ్చరించారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన ఎలా పడితే అలా వ్యహరించే జర్నలిస్టులను క్రిమినల్స్ కింద పరిగణిస్తామని, తప్పుడు వార్తలు రాసినా, పిచ్చిగా వాగినా గుడ్డలు ఊడతీసి కొడతామని వార్నింగ్ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి ఇంకా ఏమి మాట్లాడారంటే..
“ఐ అండ్ పీఆర్ లేదా డీఏవీపీ ఆమోదించిన పత్రికలు, ఛానల్స్ వాళ్లు ఇచ్చిన ఐడీ కార్డులు ఉన్నవాళ్లు జర్నలిస్టులా..? లేక ఎవడు పడితే వాడు ఏదో ఒక టీవీ, యూట్యూబ్ చానల్ పెట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడేవాళ్లు జర్నలిస్టులా? మమ్మల్ని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ఓపిక పడుతున్నాం… ఆ భాష వింటుంటే రక్తం మరుగుతోంది. కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే… మీరసలు మనుషులే అని వాళ్లను అడుగుతున్నా.
మీకు భార్యాబిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? ట్విట్టర్ లో తప్పుడు వ్యాఖ్యలతో పోస్టులు పెడుతున్న వాళ్లను అరెస్ట్ చేస్తే, ఆ అరెస్టులను ఖండిస్తున్నారు… మీ అమ్మనో, మీ భార్యనో, మీ చెల్లినో ఈ రకంగా మాట్లాడితే నువ్వు వింటావా? అని ఆ అరెస్టులను ఖండించే వారిని ప్రశ్నిస్తున్నా.
నా భార్యను, నా బిడ్డను మాట్లాడుతుంటే నాకు నొప్పి కలుగుతుంది కానీ… ఓ ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కలగదా? ఏ సంస్కృతిలో ఉన్నావు నువ్వు? ముఖ్యమంత్రిగా చెబుతున్నా… తోలు తీస్తా ఒక్కొక్కడికీ! బట్టలు విప్పదీసి రోడ్డు మీది తిప్పిస్తా! నేను మనిషినే నాకు నొప్పి కలుగుతుంది. రాజకీయాల్లో ఉన్నది నేను.. నా గురించి మాట్లాడండి, విమర్శించండి, విశ్లేషించండి… ఇంట్లో ఉన్న ఆడవాళ్లను గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడ్నించి వచ్చింది?
చంద్రశేఖర్ రావు గారూ… మీ పిల్లలకు చెప్పు… ఇది మంచిది కాదు… ఇలా ఏదో చేసి మానసికంగా కుంగదీసి, దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం పొందుదామని అనుకుంటున్నావేమో!… అలా అని కలలు కంటున్నావేమో… ఇక కుదరదు చంద్రశేఖర్ రావ్! హద్దు దాటినా, మాట జారినా దాని ఫలితం అనుభవిస్తారు” అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాగా ఇటీవల యూట్యూబ్ జర్నలిజం పేరిట సీఎం రేవంత్ రెడ్డిని అసభ్యంగా దూషించేలా వ్యవహరించిన ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.