హిందీ భాషపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ వ్యంగ్యంగా స్పందించిన సంగతి తెలిసిందే. ‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్’ అంటూ తెలిపారు. ప్రకాశ్ రాజ్ ట్వీట్‌పై జనసైనికులు మండిపడుతున్నారు.
తాజాగా ప్రకాశ్ రాజ్ విమర్శలకు ఏపీ బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి(Vishnu Vardhan Reddy) కౌంటర్ ఇచ్చారు. “మీరు బతకడం కోసం కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం నేర్చుకున్నారు. హిందీ సినిమాల ద్వారా డబ్బు సంపాదించడం ఓకే… కానీ అదే భాషపై ద్వేషాన్ని రెచ్చగొట్టడం అంటే తల్లి పాలు తాగి ఆ తల్లికి ద్రోహం చేయడమే అవుతుంది. భాషను ప్రేమించడం తప్పు కాదు… కానీ నీలాంటి వాళ్లు రాజకీయ ఓటు బ్యాంకు కోసం భాషను వాడుకోవడం సిగ్గు చేటు” అంటూ విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.