టాలీవుడ్ దర్శకుడు హరీశ్ శంకర్(Harish Shankar), సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కలయికలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’, ‘డీజే’ సినిమాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. తాజాగా వీరి మధ్య ఉన్న బాండింగ్ మరోసారి బయటపడింది. దేవి గురించి హరీశ్ శంకర్ పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.
దేవిశ్రీ ప్రసాద్ తాజాగా ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవి మాట్లాడుతూ “గద్దల కొండ గణేశ్ సినిమాకు ముందు నన్నే అడిగారు. అందులో ఒక రీమేక్ సాంగ్ ఉంది. నేను రీమేక్ చేయనని చెప్పేశాను. నా కెరీర్ లో ఎన్నడూ రీమేక్ సాంగ్ చేయొద్దని కండీషన్ పెట్టుకున్నాను. హరీశ్ శంకర్ ఆ సాంగ్ తీసేద్దాం అంటే నేను వద్దని చెప్పాను. నా కోసం సాంగ్ తీసేయొద్దని నేనే తప్పుకున్నాను. ఇదే విషయాన్ని హరీశ్ శంకర్ ఆ మూవీ ప్రెస్ మీట్ లో చెప్పాడు. ఆయనకు నా నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నాకు చెడ్డ పేరు రావొద్దని ఆయన చెప్పారు’ అంటూ తెలిపారు.
ఇదే వీడియోను హరీష్ శంకర్ పోస్టు చేస్తూ.. “గుర్తింపు కోసం ఏదైనా మాట్లాడే ఈ రోజుల్లో.. ఇలా గుర్తు పెట్టుకుని మాట్లాడటం నీకే చెల్లింది దేవి. ఇదే నీ సంస్కారం. మీ సంగీతం గురించే కాకుండా మీ సంస్కారం గురించి కూడా అందరూ మాట్లాడుకునేలా చేశారు’ అంటూ కొనియాడారు. కాగా ప్రస్తుతం వీరిద్దరి కలయికలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తెరకెక్కుతోంది.