దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్(Betting Apps) ప్రమోషన్లు చర్చనీయాంశంగా మారాయి. చాలా మంది యువత ఈ యాప్స్‌కు బానిసై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆ తర్వాత వాటి నుంచి బయటకు రాలేక ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్‌ను అనేక మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రమోట్ చేస్తూ యువతను బెట్టింగ్ భూతంలోకి దించేస్తున్నారు. ఇలాంటి వారిపై ఐపీఎస్ అధికారి, టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్(VC Sajjanar) కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించడంతో పాటు యువతను అప్రమత్తం చేస్తున్నారు.
ఇటీవల ఏపీకి చెందిన యూట్యూబర్ లోకల్ బాయ్ నాని, తెలంగాణకు చెందిన సన్నీ యాదవ్‌పై నమోదైన కేసుల్లో సజ్జనార్ పాత్ర కీలకమని చెప్పాలి. దీంతో బెట్టింగ్ యాప్స్‌కు దూరంగా ఉండాలని వరుసగా పోస్టులు పెడుతూ యువతకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి(Harsha Sai)పై ఫైర్ అయ్యారు. ఓ ఇంటర్వ్యూలో హర్ష సాయి బెట్టింగ్ యాప్ ప్రమోషన్లను సమర్థించుకుంటూ మాట్లాడుతున్న వీడియోను షేర్ చేశారు.

“చేస్తున్నదే తప్పు.. అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి. తాను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడట. బుద్దుందా అసలు! ఎంతో మంది అమాయకుల ప్రాణాలు ఆన్లైన్ బెట్టింగ్‌కు బలైతుంటే కనీసం పశ్చాత్తాపం లేదు. వీళ్లకు డబ్బే ముఖ్యం, డబ్బే సర్వస్వం.. ఎవరూ ఎక్కడ పోయినా, సమాజం, బంధాలు, బంధుత్వాలు చిన్నాభిన్నమైన సంబంధం లేదు. ఈయనకు 100 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఆఫర్ చేశారట. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించండి. మీ ఫాలోయింగ్ మార్కెట్లో పెట్టి కోట్లకు కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్లనా.. మీరు ఫాలో అవుతోంది. వెంటనే ఈ బెట్టింగ్ ఇన్‌ప్లూయెన్సర్లను అన్‌ఫాలో చేయండి. వారి అకౌంట్లను రిపోర్ట్ కొట్టండి. ఆన్లైన్ బెట్టింగ్ భూతాన్ని అంతమొందించడంలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి.” అని తెలుగు రాష్ట్రాల పోలీసులకు ట్యాగ్ చేశారు. బెట్టింగ్ ఇన్‌ప్లూయెన్సర్లను అన్‌ఫాలో చేయండి.. వారి అకౌంట్లను రిపోర్ట్ కొట్టండని యువతకు సూచిస్తున్నారు.