నిర్మాత, నటుడు బండ్ల గణేష్(Bandla Ganesh) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని మొహమాటం లేకుండా కుండబద్ధలు కొట్టినట్లు చెబుతారు. దీని వల్ల ఆయనను అభిమానించే వారితో పాటు విమర్శించే వారు కూడా ఎక్కువయ్యారు. ఇక ఆయనకు పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరైనా పవన్‌ను విమర్శిస్తే వెంటనే కౌంటర్ ఇస్తారు. తాజాగా గణేశ్ పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.
పవన్ కళ్యాణ్ హిందీ భాష వ్యాఖ్యలపై సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. “కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే, ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో, ద్రోహం ఎంత ప్రమాదకరో స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి” అంటూ రాసుకొచ్చారు. ఈ ట్వీట్ ప్రకాశ్ రాజ్‌కు కౌంటర్‌గానే పోస్ట్ చేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
