‘జయజయహే తెలంగాణ’ గీతానికి ఆంధ్రాకు చెందిన మ్యూజిక్ డైరెక్టర్‌తో సంగీతం ఇప్పించడం సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మండలిలో విమర్శించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో సంగీత దర్శకులు లేరా? అని ప్రశ్నించారు. ఉద్యమ కాలంలో పార్టీలకు అతీతంగా తెలంగాణ తల్లికి నాయకులు దండలు వేశారని, ఇప్పుడు అదే తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్చడం ఏంటని నిలదీశారు. ప్రస్తుత విగ్రహాన్ని ప్రజలు అంగీకరించడం లేదని తెలిపారు. ఇక దాశరథి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం ఒక కార్యక్రమం కూడా నిర్వహించడం లేదని.. వెంటనే ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
అలాగే గత 15 నెలల్లో రాష్ట్రానికి వచ్చిన పెట్టబడులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అసమర్థ పాలనతో పరిశ్రమలు తెలంగాణ నుంచి తమిళనాడు, గుజరాత్‌కు తరలివెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి తెలిపారు. రియల్ ఎస్టేట్ పడిపోయి ప్రజల్లో అభద్రత భావం ఏర్పడిందన్నారు. హైడ్రా(Hydraa)తో హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించడం సరికాదన్నారు. కులగణనను గేమ్ ఛేంజర్ అనడం పెద్ద జోక్ అని కవిత ఎద్దేవా చేశారు.