ప్రపంచ మూత్రపిండాల దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లో.. మెడికవర్ హాస్పిటల్స్ మరియు హార్లే డేవిడ్‌సన్ బైకర్స్ సంయుక్తంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. మూత్రపిండాల వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశ్యం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ హాజరై.. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూత్రపిండాల ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి మెడికవర్ హాస్పిటల్స్, హార్లే ఓనర్స్ గ్రూప్, బంజారా చాప్టర్ సభ్యులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ రోజుల్లో డబ్బు కన్నా ఆరోగ్యమే ముఖ్యమని ఆయన చెప్పారు.
మెడికవర్ హాస్పిటల్స్ నెఫ్రాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ కమల్ కిరణ్ మాట్లాడుతూ, కాళ్ళవాపు, అలసట లాంటి చిన్న చిన్న లక్షణాలను చాలామంది పట్టించుకోరని, కానీ అవి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD)కి సంకేతం కావచ్చని హెచ్చరించారు. చాలా మందిలో ఈ వ్యాధి ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు కనిపించవని, మధుమేహం లేకపోయినా మూత్రపిండాలు పనిచేయకపోవచ్చని ఆయన అన్నారు. భారతదేశంలో CKD వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, గత దశాబ్దంలో ఈ వ్యాధితో చాలామంది మరణించారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మధుమేహం, అధిక రక్తపోటు CKDకి ప్రధాన కారణాలని, 87% మంది CKD రోగులకు అధిక రక్తపోటు, 37.5% మందికి మధుమేహం ఉన్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు.
అధికంగా మందులు వాడటం, నీళ్ళు తక్కువగా తాగడం వంటి అలవాట్లు కూడా మూత్రపిండాలను దెబ్బతీస్తున్నాయని ఆయన హెచ్చరించారు. వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు కూడా CKD కి కారణమవుతున్నాయని, ఎండలో ఎక్కువ సమయం పనిచేసే కార్మికులు తగినంత నీరు తాగకపోవడంతో వారి మూత్రపిండాలపై ఒత్తిడి పెరిగి, క్రమంగా మూత్రపిండ వైఫల్యానికి దారితీస్తుందని ఆయన వివరించారు. “మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉన్నాయా? ముందస్తు పరీక్షలు చేయించుకోండి, ఆరోగ్యంగా ఉండండి” అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ మూత్రపిండ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
మెడికవర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ, మన శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలను బయటకు పంపడంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి చివరి దశకు చేరుకుంటే డయాలసిస్ లేదా మూత్రపిండ మార్పిడి తప్పనిసరవుతుందని ఆయన అన్నారు. డయాలసిస్ ద్వారా 50-60% రక్తం మాత్రమే శుద్ధి అవుతుందని, వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవలసి ఉంటుందని, ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ అని ఆయన వివరించారు. అంతేకాకుండా డయాలసిస్ వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉందని, దీనివల్ల రోజువారీ జీవితం కూడా ప్రభావితం అవుతుందని ఆయన అన్నారు. కాబట్టి దాతలు అందుబాటులో ఉంటే మూత్రపిండ మార్పిడి ఉత్తమమైన మార్గమని, దీనివల్ల సహజ మూత్రపిండలాగే పనిచేస్తుందని, జీవన కాలం కూడా పెరుగుతుందని ఆయన అన్నారు.
ప్రస్తుతం మూత్రపిండ మార్పిడి అవసరమైన వారిలో 5% మందికి మాత్రమే దాతలు అందుబాటులో ఉన్నారని, మిగతా 95% మంది దాతల కోసం ఎదురుచూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాతలు దొరకకపోవడమే కాకుండా రక్త గ్రూపు సరిపోకపోవడం కూడా మరో సమస్య అని ఆయన అన్నారు. దాతల్లో సుమారు 40-50% మందికి వేరే రక్త గ్రూపు ఉంటుందని, అలాంటి సమయంలో ‘ఏబీఓ ఇన్‌కంపాటబుల్ (ABOI) కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్’ ద్వారా మూత్రపిండ మార్పిడి చేస్తామని, ఈ ప్రక్రియ ద్వారా రక్త గ్రూపు సరిపోకపోయినా సురక్షితంగా మూత్రపిండ మార్పిడి చేయవచ్చని ఆయన వివరించారు.
మెడికవర్ హాస్పిటల్స్ చీఫ్ అఫ్ బిజినెస్ ఆపరేషన్స్ మహేష్ దెగ్లూర్కర్ మాట్లాడుతూ, ప్రపంచ మూత్రపిండ దినోత్సవం ద్వారా ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడానికి కృషి చేస్తామని, ఈ ర్యాలీ ద్వారా ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ బైక్ ర్యాలీ మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ నుంచి ప్రారంభమై, నియోపోలీస్ మూవీ టవర్స్, క్రిమ కేఫ్ మోకిల మీదుగా తిరిగి మెడికవర్ హాస్పిటల్స్ కు చేరుకుంది. మూత్రపిండాల ఆరోగ్యం గురించి అవగాహన కల్పించే ప్లకార్డులను ర్యాలీలో ప్రదర్శించారు.