ముంబై దాడులకు ప్లాన్ వేసిన ఉగ్రవాది.. లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్ హతమైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌లోని జీలం దగ్గర కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఆయన మేనల్లుడు అబూ ఖతల్ చనిపోయాడు. ఈ దాడిలో హఫీజ్ సయీద్ కూడా తీవ్రంగా గాయపడ్డారని.. అనంతరం రావల్పిండిలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయారని.. పాకిస్తాన్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
పాకిస్తాన్ ఆర్మీ అధికారితో సమావేశం అయ్యి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది. హఫీజ్ సయీద్‌కి చాలా దగ్గరవాడైన, లష్కరే తోయిబాలో ముఖ్య నాయకుడైన అబూ ఖతల్ ఈ దాడిలో చనిపోయాడు. 2024 జూన్ 9న జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్-జమ్మూ హైవేపై జరిగిన బస్సు దాడికి అబూ ఖతల్ ప్లాన్ వేశాడు. ఈ దాడిలో బస్సు అదుపు తప్పి లోయలో పడి 10 మంది చనిపోయారు.
హఫీజ్ సయీద్ కూడా చనిపోయినట్లు పాకిస్తాన్ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలు ఈ వార్తను విస్తృతంగా పంచుకుంటున్నారు. అయితే, పాకిస్తాన్ అధికారులు ఇంకా దీనిని నిర్ధారించలేదు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ PTI నాయకుడు సమద్ యాకూబ్ కూడా ఈ వార్తలపై స్పందించారు.. తనకు అందిన సమాచారం ప్రకారం హఫీజ్ సయీద్, అతని మేనల్లుడు దాడిలో చనిపోయారని ఆయన అన్నారు. అయితే తన తండ్రి క్షేమంగా ఉన్నారని సయీద్ కుమారుడు తల్హా సయీద్ తెలిపారు.
26/11 ముంబై దాడులు, పుల్వామా దాడితో సహా భారత్‌లో జరిగిన అనేక దాడులకు ప్లాన్ వేసిన హఫీజ్ సయీద్ భారతదేశం అత్యంత వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడు. జాతీయ భద్రతకు ఆయన పెద్ద ముప్పుగా భావించిన భారత ప్రభుత్వం చాలా కాలంగా ఆయనను అప్పగించాలని పాకిస్తాన్‌ను కోరుతోంది. అయితే పాకిస్తాన్ మాత్రం భారత్ ఆరోపణలను తోసిపుచ్చుతూ వస్తోంది.