ఏపీలో ప్రజాప్రతినిధులకు ఆటల పోటీలు నిర్వహించనున్నారు. సోమవారం నుంచి మూడు రోజులపాటు శాసనసభ్యులకు ఆటలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గేమ్స్, కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు పరిశీలించారు.
శాసనసభ్యులకు ఆటల పోటీలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తున్న ఆనవాయితీ అని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. గడిచిన ఐదేళ్లలో ఈ ఆనవాయితీ గాడి తప్పిందన్నారు. శాసనసభ్యులందరికీ ఆహ్వానాలు పంపించామన్నారు. వైసీపీ శాసనసభ్యులు కూడా వస్తారని ఆశిస్తున్నామన్నారు జీవీ ఆంజనేయులు. అధికార ప్రతిపక్ష సభ్యులు అన్నదమ్ములా ఉండాలని ఆయన సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సతీసమేతంగా హాజరవుతారని వెల్లడించారు. మొత్తం 12 విభాగాల్లో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు జీవీ ఆంజనేయులు చెప్పారు.
ఆటలు, సాంస్కృతిక ఈవెంట్ లో భాగంగా ఎమ్మెల్యేలకు కబడ్డీ, బ్యాడ్మింటన్, సింగింగ్, డ్యాన్సింగ్ వంటి పోటీలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు తమలోని టాలెంట్ ను చూపించడానికి ఇదొక మంచి వేదిక కానుంది. ఈ పోటీల్లో విజేతలకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సత్కరించనున్నారు. నిత్యం రాజకీయాల్లో బిజీబిజీగా ఉంటూ ఎంతో ఒత్తిడిని ఎదుర్కొనే ఎమ్మెల్యేలు కాస్త రిలాక్స్ అయ్యేందుకు ఇలాంటి ఈవెంట్స్ దోహదపడతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.