బాదంపప్పులో విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని రోజూ తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. బాదం నానబెట్టినా, అలాగే తిన్నా, వంటల్లో వాడినా మంచిదే. బాదంలో ఉండే పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, బరువు తగ్గడానికి సహాయపడతాయి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
కానీ రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి అనేది చాలా ముఖ్యం. నిపుణుల అభిప్రాయం రోజుకు 20-25 బాదం పప్పులు తినడం వల్ల పెద్దలకు ఎటువంటి హాని ఉండదని, పిల్లలకు 10 సరిపోతుందని చెప్పారు. అయితే, కొందరిలో ఇది భిన్నంగా ఉండవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఎక్కువగా బాదం తింటే జీర్ణ సమస్యలు, బరువు పెరగడం, కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు రావచ్చు అని చెబుతున్నారు.
ఉదయం పూట నానబెట్టిన బాదం తినడం వల్ల రోజంతా శక్తిగా ఉంటుందంట. భోజనం తర్వాత కూడా బాదం తినొచ్చు. బాదంలో ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. బాదంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా బాదం మంచిదని నిపుణులు అంటున్నారు.
మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపర్, విటమిన్ E, B, రైబోఫ్లేవిన్, థయామిన్, నియాసిన్, ఫోలేట్ వంటి పోషకాలు బాదంలో పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యల ముప్పును తగ్గిస్తాయని చెబుతున్నారు. (గమనిక: ఈ కథనంలో మేము అందించిన సమాచారం.. కేవలం నిపుణుల అభిప్రాయం ప్రకారం రాసినది.. ఆచరించే ముందు వైద్యులను సంప్రదించండి. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)