తెలంగాణ అసెంబ్లీలో(Telangana Assembly)లో కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు దేవాదాయ చట్ట సవరణ బిల్లులను సభ ముందుకు తీసుకొచ్చింది. ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ, బీసీ రిజర్వేషన్ల బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు. దేవాదాయ చట్టసవరణ బిల్లును మంత్రి కొండా సురేఖ సభ ముందుకు తీసుకొచ్చారు. ఇక తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు పెట్టే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కొన్ని వర్సిటీలకు ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, పీవీ నరసింహారావు పేర్లు పెట్టుకున్నామని గుర్తు చేశారు. అదే ఒరవడిలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును మారుస్తున్నామని తెలిపారు. అంతే తప్ప ఎవరికీ వ్యతిరేకంగా ఈ పేరు మార్చడం లేదని స్పష్టం చేశారు. పొట్టి శ్రీరాములు వర్సిటీ ఏపీలో అదే పేరుతో కొనసాగుతుందన్నారు.