తమ ప్రభుత్వంలో రైతులకు రూ. 20, 616 కోట్లు రుణమాఫీ చేశామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) బడ్జెట్(Telangana Budget) ప్రసంగంలో తెలిపారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ. 12000 చొప్పున రైతు భరోసాకు రూ. 18000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నామన్నారు. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య 8,332కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు టన్నుకు రూ. 2000 అదనపు సబ్సిడీ అందిస్తామన్నారు. వడ్ల బోనస్ కింద రైతులకు రూ. 1,206 కోట్లు చెల్లిస్తామన్నారు.
ఆరోగ్య శ్రీ పరిధి రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచారు. కొత్తగా 1,835 వైద్య చికిత్సలు ఆరోగ్యశ్రీలో చేర్చారు. 90 లక్షల పేద కుటుంబాలకు ఆరోగ్యశ్రీ లబ్ధి చేకూరేలా ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ఖర్చును 20 శాతం పెంచుతున్నామని భట్టి వెల్లడించారు. ఇక వైద్య కళాశాలలకు భారీగా నిధులు కేటాయించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి రూ. 11,600 కోట్లు కేటాయించారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ స్కూల్స్ లో ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్‌తో పాటు ఉచిత వసతులు సమకూరుస్తామన్నారు. గురుకులాల కోసం డైట్ ఛార్జీలు 40 శాతం కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం పెంపుతో పాటు విద్యార్థులకు ఉచితంగా సాయంత్రం స్నాక్స్ పథకం తీసుకొస్తామన్నారు. నిరుద్యోగుల కోసం రాజీవ్ యువ వికాస పథకానికి రూ. 6000 కోట్లు కేటాయించారు.