కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ బడ్జెట్(Telangana Budget)లో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు(Ration Cards) ఇవ్వడంతో పాటు సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీ, అదనపు కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసే ప్రక్రియను జనవరి 26 నుంచి ప్రారంభించామని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన పదేళ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేకపోయిందని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే ఈ ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. త్వరలోనే అర్హులైన అందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు.
కాగా రేషన్ కార్డుల్లో కొత్త పేర్ల నమోదు, తప్పులు సరిదిద్దుకోవడం, కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు, ఇంటి కరెంట్ బిల్లు తప్పనిసరిగా దరఖాస్తులో జత చేయాలి. ప్రజాపాలన, ప్రజావాణి కార్యక్రమాల్లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు దరఖాస్తు కోసం ప్రభుత్వం రూ.50 ఫీజుగా నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవా ద్వారా ఇప్పటివరకు 1.50 లక్షల అప్లికేషన్లు అందినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి, దశలవారీగా స్మార్ట్ రేషన్ కార్డులు అందించనున్నారు.