తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) భారీ ఊరట దక్కింది. రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో మాజీ మంత్రి కేటీఆర్(KTR) చెందిన జన్వాడ ఫామ్‌హౌస్ మీద డ్రోన్ ఎగురవేశారంటూ ఆయనపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు 18 రోజులు జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనపై పెట్టిన తప్పుడు కేసును కొట్టివేయాలని కోరుతూ 2020 మార్చిలో రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేసును కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నమోదైన కేసును కూడా హైకోర్టు కొట్టివేసింది. సీఎం రేవంత్‌రెడ్డిని కించపర్చే విధంగా మాట్లాడారని భువనగిరి ఎంపీ అనిల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసును కొట్టేయాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.