తెలంగాణ ప్రభుత్వం పేద మరియు మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను నిజం చేసేందుకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నగర శివార్లలో శాటిలైట్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయనున్నట్లు 2025-26 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ టౌన్‌షిప్‌లను ఔటర్ రింగ్ రోడ్ (ORR) చుట్టూ నిర్మించి అందుబాటు ధరలలో ఇళ్లను అందిస్తామని తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రధాన రహదార్లకు అనుసంధానంగా ఈ శాటిలైట్ టౌన్‌షిప్‌లు ఉంటాయని, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా ఇళ్లను నిర్మిస్తామని మంత్రి వివరించారు. నగర జనాభా పెరుగుదల దృష్ట్యా గృహాల కొరతను తీర్చడంలో ఈ టౌన్‌షిప్‌లు కీలక పాత్ర పోషిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం హామీ ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదని, 34,545 ఇళ్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని మంత్రి విమర్శించారు. వీటిని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడానికి రూ.305.03 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రజలకు ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గానికి కనీసం 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 4,50,000 ఇళ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు కేటాయించినట్లు మంత్రి ప్రకటించారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తిరిగి ప్రారంభించి కొత్త ఇళ్ల పట్టాలను మహిళల పేరుతోనే ఇస్తామని, దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైందని తెలిపారు. ఈ పథకం పూర్తి పారదర్శకంగా ఉంటుందని, లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. అన్ని వర్గాల అభివృద్ధికి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, శాటిలైట్ టౌన్‌షిప్‌ల నిర్మాణం వేగవంతం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. పేదలకు ఇళ్ల పంపిణీలో పారదర్శకత పాటిస్తామని, నగర అభివృద్ధిని సమతుల్యం చేసేలా ఈ టౌన్‌షిప్‌లు ఉంటాయని చెప్పారు.