రాష్ట్ర పునర్నిర్మాణానికి ఈ బడ్జెట్ పునాదిలాంటిదని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చిందని, ప్రజలకు మేలు చేసేలా ఈ బడ్జెట్ ను రూపొందించామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని ఆయన ఒక తెలిపారు. “తెలంగాణ రైజింగ్” పేరుతో 2050 నాటి లక్ష్యాలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉందని, అన్ని వర్గాల ప్రజల కలలను ఈ బడ్జెట్ సాకారం చేస్తుందని మంత్రి అన్నారు.
వ్యవసాయ రంగానికి 24,439 కోట్లు, రైతుబంధు పథకానికి 18,000 కోట్లు కేటాయించడం ద్వారా రైతులకు మేలు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని కృష్ణారావు అన్నారు. సాగునీటి రంగానికి 23,373 కోట్లు కేటాయించడం శుభపరిణామమని ఆయన అన్నారు. విద్య, వైద్యంతో పాటు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కూడా ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చామన్నారు. రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మూలధన వ్యయాన్ని 36,504 కోట్ల రూపాయలకు పెంచామని మంత్రి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించామని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన అన్నారు.
తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కొత్త పర్యాటక విధానాన్ని (2025-2030) రూపొందించామని కృష్ణారావు చెప్పారు. 2030 నాటికి GSDPలో పర్యాటక రంగం వాటాను 10 శాతానికి పెంచడం, 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం, 3 లక్షల ఉద్యోగాలను సృష్టించడం ఈ విధానం లక్ష్యమని ఆయన వివరించారు. ఈ లక్ష్యసాధన కోసం ఈ బడ్జెట్లో పర్యాటక శాఖకు 775 కోట్ల రూపాయలు కేటాయించామని ఆయన తెలిపారు.