రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల చట్టం ఒక చరిత్రని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల క్రమబద్ధీకరణ బిల్లు-2025 ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) శాసనసభ( Assembly)లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ బిల్లు ద్వారా కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించబోతోంది. ఉపాధ్యాయుల బదిలీల విషయంలో చంద్రబాబు గారి పాలనలో పారదర్శకంగా వ్యవహరించడం జరిగింది. ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్-1982లో లీగల్ అథారిటీ ఆనాడు కల్పించడం జరిగింది.
1998లో ఆనాడు చంద్రబాబునాయుడు జడ్పీ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం జడ్పీ సీఈవో నుంచి డీఈవోకు అప్పగించడం జరిగింది. 2012-15 మధ్య కూడా అనేక సంస్కరణలు తీసుకువచ్చాం. అనేక రెగ్యులేషన్స్ తీసుకురావడం జరిగింది. పాయింట్ బేస్ కోరింగ్ సిస్టమ్ ఆనాడు అమలుచేశాం. 2015లో వెబ్ బేస్డ్ ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ కౌన్సిలింగ్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. 2017లో గైడ్ లైన్స్ తీసుకువచ్చి కంపల్సరీ ట్రాన్స్ ఫర్స్ కూడా అమలుచేయడం జరిగింది. జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ స్కూల్స్ విషయానికి వస్తే వారికి సొంత మార్గదర్శకాలు ఉన్నాయి. గతంలో అనేక కోర్టు కేసులు, కంటెమ్ట్ ఆఫ్ కోర్టు కూడా ఉన్నాయి. అందేకే ఏకీకృత చట్టం తీసుకురావాలని భావించాం.
గత ప్రభుత్వంలో అడ్డగోలుగా ఉపాధ్యాయ బదిలీలు
గత ప్రభుత్వంలో అడ్డగోలుగా ఉపాధ్యాయ బదిలీలు చేశారు. ఒక పద్ధతిని పాటించకుండా ఇష్టారాజ్యంగా చేశారు. ఎన్నికల సమయంలో కూడా 1100 మంది ఉపాధ్యాయులను ఏకపక్షంగా ట్రాన్స్ ఫర్ చేశారు. కోర్టు జోక్యం చేసుకుని రద్దు చేయడం జరిగింది. కావాలని కొంతమందిపై రాజకీయ కక్షతో బదిలీలను నిలిపివేశారు. గడచిన ఐదేళ్లలో అనేక లిటిగేషన్స్ వచ్చాయి. అనేకసార్లు కోర్టులు కూడా జోక్యం చేసుకున్నాయి. ఒక యాక్ట్ తీసుకువచ్చి పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలను చేపట్టాలనే లక్ష్యంతో పనిచేశాం. రాజకీయ జోక్యాన్ని నివారించాల్సిన అవసరం ఉంది. బోధనపైనే ఉపాధ్యాయులు దృష్టిపెట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఈ ఆన్ లైన్ ద్వారా ట్రాన్సపరెన్సీ, అకౌంటబులటీ కూడా తీసుకువస్తాం. గ్రీవెన్స్ రిడ్రెసెల్ మెకానిజం కూడా ఈ బిల్లులో పొందుపర్చడం జరిగింది. గైడ్ లైన్స్ ఎఫెక్టివ్ గా రూపొందించాలనే లక్ష్యంతో ఉన్నాం.
అందరితో చర్చించిన తర్వాతనే యాక్ట్ ను తీసుకువచ్చాం
గతంలో గైడ్ లైన్స్ లీగల్ గా బలహీనంగా ఉండేవి. ఈ యాక్ట్ ద్వారా బలంగా ఉంటాయి. స్థిరత్వం ఏర్పడుతుంది. ఎన్ ఫోర్స్ బులిటీ నూటికి నూరుశాతం చేయవచ్చు. పారదర్శక విధానంతో ఉపాధ్యాయుల సీనియారిటీ, తదితర విషయాలు తెలుసుకోవచ్చు. గత ప్రభుత్వం మాదిరిగా ఏకపక్ష చట్టాలు ఈ కూటమి ప్రభుత్వం రూపొందించడం లేదు. ఒక సంస్కరణ తీసుకురావాలంటే అందరితో చర్చించడం జరుగుతోంది. ఇప్పటికే అనేక ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాం. వైసీపీ సంఘంతో కూడా చర్చించాం. ట్రాన్స్ ఫర్ గైడ్ లైన్స్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకువచ్చి ఈ యాక్ట్ ను అమలుచేయాలని భావించాం. ప్రమోషన్స్ చాలా పారదర్శకంగా చేస్తాం. ఉపాధ్యాయుల నుంచి కూడా అభిప్రాయసేకరణ చేశాం. 7,735 సలహాలు వచ్చాయి. అవన్నీ పరిగణనలోకి తీసుకుని ముసాయిదాను రూపొందించడం జరిగింది. పొరుగు రాష్ట్రాల్లో కూడా పరిశీలించడం జరిగింది. కర్ణాటక, ఉత్తరాఖండ్, అస్సాంలో ఈ టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ అమల్లో ఉంది.
పారదర్శకంగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా
తండాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల నుంచి మున్సిపాలిటీల వరకు విద్యార్థులకు సమర్థమైన ఉపాధ్యాయులను అందించాలి, మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో ఈ యాక్ట్ ను రూపొందించడం జరిగింది. ఐటీడీఏ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు అదనపు పాయింట్స్ ఇచ్చి ప్రోత్సహించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి సంస్కరణలు పూర్తిచేసి ఎగ్జిక్యూట్ చేస్తామన్నారు. ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్ట్ పారదర్శకంగా రూపొందిస్తున్నామన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ కూడా జారీచేస్తామన్నారు.
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో పారదర్శకత ముఖ్యం. గతంలో ఉపాధ్యాయుల నియామకాల్లో, బదిలీల్లో అవినీతి, అక్రమాలు జరిగాయి. మంత్రి నారా లోకేష్ తీసుకువచ్చిన చట్టం మంచి చట్టమని అన్నారు. బిల్లును పూర్తిగా సమర్థిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని కోరారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. ఉన్నత విలువలు, ఉన్నత విద్య అభ్యసించిన వ్యక్తికి విద్యాశాఖ అప్పగించడం ఏపీకి మంచిదని అన్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఏపీ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల క్రమబద్ధీకరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.