Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Opposition Unity: ప్రతిపక్షాల ఐక్యత ఎండమావేనా?

Opposition Unity: ప్రతిపక్షాల ఐక్యత ఎండమావేనా?

ప్రస్తుతం దేశంలోని ప్రతిపక్షాల పరిస్థితి పూర్తిగా అగమ్యగోచరంగా ఉంది. వాటికి ఎక్కడా ఏవిధమైన దారీ తెన్నూ కనిపించడం లేదు. పాలక పక్షం వేధిస్తోందని, ప్రతీకార చర్యలు చేపడుతోందని, రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని వేటికవే గగ్గోలు పెట్టడం తప్ప, ఈ సమస్యలను అవకాశంగా తీసుకుని ఒకే తాటి మీదకు రావాలనే ఆలోచన వాటికి కలగడం లేదు. తాత్కాలికంగానైనా ఒక సంకీర్ణంగా ఏర్పడే ప్రయత్నం చేయడం లేదు. అంతేకాదు, పాలక పక్షం పాల్పడుతోందని చెబుతున్న ఏ అరాచక చర్యనీ అవి ప్రశ్నించడం గానీ, నిలదీయడం గానీ, ఎదుర్కోవడం గానీ చేయలేకపోతున్నాయి. సమన్వయాన్ని సాధించడానికి, ఏకాభిప్రాయానికి రావడానికి కనీస మాత్రంగా కూడా ప్రయత్నం జరగడం లేదంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఏదో ఒక సమస్య మీద బీజేపీపై కలసికట్టుగా పోరాడాలని చేస్తున్న సూచనలు, ఇస్తున్న పిలుపులు కూడా ఆషామాషీగా ఉంటున్నాయి తప్ప, వాటిల్లో ఎక్కడా చిత్తశుద్ధి కనిపించడం లేదు. ప్రతిపక్షాలను ప్రస్తుతం అహంకారం, అనాసక్తత అనే రెండు లక్షణాలు పట్టి పీదిస్తున్నాయి.
విచిత్రమేమిటంటే, ప్రతిపక్షాలలో కొన్ని ప్రధాన పార్టీలకు జాతీయ స్థాయిలో ఆశలు, ఆశయాలు ఉన్నాయి కానీ, అవి చివరికి స్థానిక స్థాయిలో పనిచేయడానికే పరిమితం అయిపోతున్నాయి. ఇందులో జాతీయ స్థాయి పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్‌ పరిస్థితి కూడా రానురానూ కుంచించుకుపోతోంది. అది కూడా ప్రాంతీయ పార్టీ స్థాయిలోనే ఆలోచిస్తూ, ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగిపోతోంది. ఏతావతా ప్రతిపక్షాలన్నీ దెబ్బ ఒక చోట తగిలితే మందు ఒక చోట వేస్తూ కాలక్షేపం చేస్తున్నాయి. పాలక బీజేపీ విషయంలో ప్రతిపక్షాలన్నిటికీ వేదనలు, ఆవేదనలు ఉన్నాయి. అక్కడక్కడా అప్పుడప్పుడూ అవి తమ ప్రతీకారేచ్ఛను కూడా బయటపెడుతున్నాయి. ఉదాహరణకు, కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీకి చెందిన బిజినెస్‌ స్కూల్‌లో ఉపన్యసిస్తూ, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభాలుగా భావిస్తున్న పార్లమెంట్‌, న్యాయవ్యవస్థ, పత్రికలు వగైరాలన్నీ ఒక్కొటొక్కటిగా కుప్పకూలిపోతున్నాయని, వీటన్నిటికీ సంకెళ్లు వేశారని వ్యాఖ్యానించారు. మాజీ కాంగ్రెస్‌ నాయకుడు, స్వతంత్ర రాజ్యసభ సభ్యుడు అయిన కపిల్‌ సిబల్‌ కూడా ఇటీవల ఢిల్లీలో ఒక సమావేశంలో దాదాపు ఇదే రకమైన వ్యాఖ్యలు చేస్తూ, న్యాయం కోసం పోరాడాల్సిన పరిస్థితి తలెత్తిందని, న్యాయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థలు క్రమక్రమంగా నీరుకారిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈడీకే సర్వాధికారాలని అంటూ ఇదేం ప్రజాస్వామ్య వ్యవస్థో అర్థం కావడం లేదని అన్నారు.
అవకాశాల దుర్వినియోగం
వాస్తవానికి, ఇటీవలి కాలంలో ప్రతిపక్షాలకు రెండు అవకాశాలు కలిసి వచ్చాయి. ఇందులో ఒకటి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కాగా, రెండవది గౌతమ్‌ అదానీ వ్యవహారం. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే నాయకత్వంలో 16 పార్టీల నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ, భారత రాష్ట్ర సమితి నాయకులు కూడా పాల్గొన్నారు. కాగా, ఇందులో లిక్కర్‌ కుంభకోణంలో ఉన్నారనే ఆరోపణలున్నా ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ మంత్రి అయిన మనీశ్‌ సిసోడియా, భారత రాష్ట్ర సమితి నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు అయిన కె. కవిత కూడా పాల్గొన్నారు. ఈ రెండు పార్టీలకు కాంగ్రెస్‌తో పడని విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఈ పార్టీలు ఎంత వీలైతే అంత ప్రతిపక్షాల మద్దతును కూడగట్టుకుని ఉండాల్సింది. దర్యాప్తు సంస్థల కారణంగా ప్రతిపక్షాలన్నీ నానా అవస్థలూ పడుతున్నప్పటికీ, ఈ సమావేశానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం హాజరు కాలేదు.
ఈ సమావేశానికి హాజరు కాకపోవడానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ సమాధానం పంపించారు. ఐక్యత కోసం ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు అపరిపక్వంగా ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. అంతేకాక, కాంగ్రెస్‌తో తాము తేల్చుకోవాల్సిన విషయాలు అనేకం ఉన్నాయని, వాటిని ద్వైపాక్షికంగా పరిష్కరించుకున్న తర్వాతే ఐక్యతా ప్రయత్నాలకు చేయూతనివ్వగలుగుతామని ఆమె తేల్చి చెప్పారు. ఇక, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ సందీప్‌ దీక్షిత్‌, మరో ఇద్దరు మాజీ ఢిల్లీ మంత్రులు కలిసి, సిసోడియాపై ‘దేశ ద్రోహ నేరం’ కింద చర్య తీసుకోవాల్సిందిగా ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ వి.కె. సక్సేనాకు లేఖ రాయడం ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఆగ్రహం తెప్పించింది. సక్సేనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అ లేఖ పంపిస్తూ, సిసోడియాపై దేశ ద్రోహ నేరం కింద, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద చర్య తీసుకోవాల్సిందిగా సిఫారసు చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్‌, బీజేపీలు కుమ్మక్కయ్యాయని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపించింది.
అనేకానేక అవరోధాలు, అడ్డంకులు
ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌ కేసులు రెండూ భిన్నమైనవే అయినప్పటికీ, ప్రతిపక్షాల మధ్య ఏవిధమైన వైరుధ్యాలు ఉన్నాయన్నది ఇవి చెప్పకనే చెబుతున్నాయి. కీలక సమయాల్లో ఈ వైరుధ్యాలు బయటపడి ఐక్యతా ప్రయత్నాలను చెడగొడుతున్నాయి. లిక్కర్‌ కుంభకోణం కారణంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రస్తుతం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది కనుక దీనిని అవకాశంగా తీసుకుని తాను మళ్లీ ఎదగాలని కాంగ్రెస్‌ ఎత్తులు పైఎత్తులు వేస్తోంది. అంతేకాదు, కొన్ని ప్రధాన ప్రతిపక్షాలకు సి.బి.ఐ, ఇ.డిలు ఇస్తున్న సమస్యలను అవకాశంగా తీసుకోవడానికి కాంగ్రెస్‌ శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తోందనే ఆరోపణలు వినవస్తున్నాయి. అదానీ వ్యవహారాన్ని కాంగ్రెస్‌ పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ప్రస్తావించినప్పుడు బీజేపీ, బ్రిటన్‌లో రాహుల్‌ గాంధీ భారత్‌పై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించి, అసలు విషయాన్ని దారి మళ్లించింది. ఒక బీజేపీ ఎంపీ ఈ వ్యాఖ్యల గురించి సుదీర్ఘంగా ప్రసంగిస్తున్నప్పుడు కాంగ్రెస్‌ ఆయనపై సభాహక్కుల భంగం కింద నోటీసు ఇవ్వడం కూడా జరిగింది.
ఇక ప్రతిపక్షాలను వేధించడానికి, వాటిపై ప్రతీకారం తీర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీలను ప్రయోగించడం గురించి ప్రతిపక్షాలు ప్రస్తావించినప్పుడు, యూపీఏ హయాంలో కాంగ్రెస్‌ నాయకులు తీవ్ర స్థాయిలో అవినీతికి పాల్పడిన విషయాన్ని పదే పదే ప్రస్తావించి ఆ పార్టీని నోరు మూయించడం జరిగింది. నిజానికి అప్పట్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ లేకపోయినప్పటికీ, సిసోడియా వ్యవహారంతో ఆ పార్టీ కూడా బీజేపీ విమర్శలను, ఆరోపణలను ఎదుర్కోలేకపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఎక్కడి నుంచి ఐక్యతా ప్రయత్నాలు ప్రారంభించాలన్నది అంతుబట్టడం లేదు. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే మరిన్ని వైరుధ్యాలు కళ్లకు కడతాయి. ఈ ప్రతిపక్షాలలో ఒక పార్టీకి మరో పార్టీకి పడకపోవడం అన్నది రాష్ట్రాలలో మరీ స్పష్టం కనిపిస్తూ ఉంటుంది. మరి కొంత కాలం పాటు ఈ ప్రశ్నలు, సందేహాలకు సమాధానాలు లభించకపోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం ప్రతిపక్షాల ఐక్యతా ప్రయత్నాలు ఎండమావేనని చెప్పవచ్చు.
-డాక్టర్‌ వి.ఎస్‌. సుందరరావు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News