Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Eric Garcetti: కొత్త రాయబారికి కత్తి మీద సామే

Eric Garcetti: కొత్త రాయబారికి కత్తి మీద సామే

భారత్‌లో కొత్త అమెరికా రాయబారిగా లాస్‌ ఏంజిల్స్‌ మాజీ మేయర్‌ ఎరిక్‌ గార్సెట్టి పేరు 20 నెలల క్రితమే బయటికి వచ్చింది. ఆయన పేరును దేశాధ్యక్షుడు జో బైడన్‌ ప్రతిపాదించినప్పుడు దాన్ని ఆమోదింవడానికి సెనేట్‌కు ఇంత కాలం పట్టింది. జో బైడెన్‌ విపరీతంగా ఒత్తిడి తీసుకు రావడంతో చివరికి సెనేట్‌ ఆయన పేరును 52-42 ఓట్ల తేడాతో ఎట్టకేలకు ఆమోదించింది. అమెరికా అధ్యక్షుడుగా బైడెన్‌ ప్రచారం ప్రారంభించినప్పుడు గార్సెట్టి ఆయన ప్రచార బృందంలో ఒక ప్రముఖ వ్యక్తి. ఇందుకు ప్రతిఫలంగా బైడెన్‌ ఆయన పేరును భారత రాయబారి పదవికి ప్రతిపాదించారు. మేయర్‌గా ఉన్నప్పుడు ఆయన సహాయకుడొకరి మీద లైంగిక దాడికి సంబంధించిన ఆరోపణ రావడం, ఆ ఆరోపణను ఖండించిన గార్సెట్టి ఆయనకు గట్టి మద్దతునివ్వడం వంటి కారణాల వల్ల గార్సెట్టి పేరును సెనేట్‌ తొక్కిపెట్టి ఉంచింది. అయితే, బైడెన్‌ పట్టుబట్టడంతో చివరికి ఆయన పేరుకు ఆమోదం లభించింది.
రాజకీయ అవగాహనలో సాటి లేని మేటిగా గుర్తింపు ఉన్న ఎరిక్‌ గార్సెట్టి అప్పట్లో ఉపాధ్యక్ష పదవికి భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ పేరును సూచించడమే కాకుండా, ఈ విషయంలో బైడెన్‌ను ఒప్పించడంలో కూడా కృతకృత్యులయ్యారు. ఆయన ఎటువంటి సమయంలోనైనా బైడెన్‌ తేలికగా కలుసుకోగలగడం ఆయనకున్న మరో ప్లస్‌ పాయింట్‌. అయితే, భారత రాయబార పదవికి ఆయన అర్హుడా కాదా అన్నది మాత్రం అంతుబట్టని విషయం. ఆయన అందుకు తగ్గట్టుగా తన సిబ్బందిని, సహాయకులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. జి-20 అధ్యక్ష స్థానంలో రన్న కారణంగా భారత్‌ వివిధ అంతర్జాతీయ కార్యకలాపాలతో , ఏమాత్రం తీరిక లేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో అమెరికా రాయబారిగా ఆయన నియామకం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ భారత్‌ ఆ దేశం నుంచి చమురును దిగుమతి చేసుకోవడాన్ని బట్టి విదేశాంగ విధానం విషయంలో భారత్‌ తనకంటూ ఒక స్వతంత్ర విధానాన్ని అనుసరిస్తున్నట్టు అర్థం చేసుకోవాల్సి ఉంది. రకరకాల ఒప్పందాల ద్వారా మిత్రదేశాల సంఖ్యను పెంచుకుంటున్న భారత్‌ ఆసియా ఖండంలో చైనాకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోంది. భారత్‌ కుదర్చుకుంటున్న ఒప్పందాలు, స్నేహాలు ఇండో పసిఫిక్‌ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచడానికి కూడా తోడ్పడుతున్నాయి. అంతర్జాతీయంగా ఇప్పటికే అయిదవ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ మరో కొద్ది సంవత్సరాలలో రెండో స్థానానికి చేరుకునే అవకాశం కూడా ఉంది.
అంతేకాదు, చైనాతో విసుగెత్తిపోయిన దేశాలన్నీ భారత్‌తో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకుంటున్న విషయాన్ని కూడా విస్మరించకూడదు. ఇప్పటికే మేజర్‌ టెలికామ్‌ సంస్థ యాపిల్‌, అంతర్జాతీయ స్థాయి విమానయాన సంస్థ బోయింగ్‌ భారత్‌లో అడుగుపెట్టాయి. మొత్తం మీద ఇటువంటి స్వతంత్ర విదేశాంగ విధానానికి, వర్ధమాన ప్రత్యామ్నాయ శక్తికి గార్సెట్టి అండగా నిలవాల్సి ఉంటుంది. భారత-చైనాల మధ్య ఉన్న మెక్‌మహాన్‌ సరిహద్దు రేఖను గుర్తించడానికి సంబంధించిన ప్రతిపాదన ఒకటి సెనేట్‌ పరిశీలనలో ఉంది. ఆ ప్రతిపాదన ఆమోదం పొందితే, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ ప్రదేశ్‌ భారత భూభాగమేనని, దీంతో చైనాకు ఎటువంటి సంబంధమూ లేదనే విషయాన్ని అమెరికా గుర్తించినట్టు అవుతుంది. గార్సెట్టి తానొక రాజకీయ ఉద్యమకర్త అని అభిప్రాయపడుతుంటారు. ఆయన 2021 డిసెంబర్‌లో సెనేట్‌కు చెందిన విదేశాంగ వ్యవహారాల కమిటీ ముందు మాట్లాడుతూ, తాను భారత రాయబారిగా అక్కడి మానవ హక్కులు, వివక్షలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. అంటే ఆయన జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు జరగడానికి ముందు ఆర్టికల్‌ 370 రద్దుపై ఒక నిర్ణయం తీసుకుంటారా, ప్రతిపక్షాలపై ప్రభుత్వం తన దర్యాప్తు సంస్థలను ఉసిగొలుపుతోందనే ప్రచారంపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తారా అన్నది ఆలోచించాల్సిన విషయమే. అధికార పక్షంతో ఆయన సంబంధాలు ఎలా ఉండబోతున్నాయన్నది వేచి చూడాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News