తెలంగాణ అసెంబ్లీ(TG Assembley) సమావేశాలు 10వ రోజు కొనసాగుతున్నాయి. సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి ప్రభుత్వం హామీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు(BRS MLCs) వినూత్నంగా నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా శాసనమండలి ఆవరణలో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇచ్చే హామీని అమలు చేయాలని నిరసనకు దిగారు. తక్షణమే మహిళలకు తులం బంగారం ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బంగారు కడ్డీల ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటివరకు పెళ్లైన వారికి కూడా తులం బంగారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. తులం బంగారం కోసం ఆడ పిల్లల తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారని తెలిపారు.
అనంతరం మండలిలో బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత మధుసూదన చారి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయల స్కీం ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా లోకానికి తులం బంగారం ఇవ్వలేదు, నెలకు రూ.2500 ఇవ్వలేదని విమర్శించార. మహిళలను సెంటిమెంట్ పేరుతో నమ్మించి మోసం చేశారని చెప్పారు. తక్షణమే పెళ్లైన అమ్మాయిలకు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి మహిళా లోకం బుద్ధిచెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.