పిఠాపురం ప్రాంతంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి ₹59.70 కోట్లతో పాలనపరమైన అనుమతి లభించడం ఎంతో ఆనందంగా ఉందని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan kalyan) తెలిపారు. ఈమేరకు ఆయన కార్యాలయం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.
“ఎన్నికల సమయంలో నేను ఈ వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చాను. సామర్లకోట-ఉప్పాడ రహదారిలో రైల్వే క్రాసింగ్ కారణంగా ప్రజలు రోజూ తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత రాకపోకలు సులభతరం అవుతాయి, ప్రజల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఈ రహదారి కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (CRIF) సేతు బంధన్ పథకంలో భాగంగా చేపట్టడమైనది.
ఈ ఆర్వోబీకి నిధులు మంజూరు చేసి అండగా నిలిచిన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్దన రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వంతెన త్వరగా ప్రజలకు అందుబాటులోకి రావాలని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు.