ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్(Betting Apps)లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాప్‌లపై మాజీ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో లేవనెత్తిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో గేమింగ్ యాప్‌లపై నిషేధం విధించినప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటీవల పలు ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. గత కొద్దిరోజులుగా జరుగుతున్న ఘటనలపై కాంగ్రెస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు.
ఆన్‌లైన్ రమ్మీ వంటి ఇతర గేమ్‌ల నిరోధానికి, నిషేధానికి ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కొన్ని రోజులుగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోషన్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి విచారించామని పేర్కొన్నారు. అయితే బెట్టింగ్ యాప్‌లపై విచారణ జరిపేందుకు ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను నిర్వహించే వారికి శిక్షను పెంచేందుకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సవరణ బిల్లును సభలో ప్రవేశపెడతామని రేవంత్ వెల్లడించారు.