గంజాయి లేడీ డాన్ సంగీతా సాహు(Sangitha Sahu)ను అలియాస్ గీతా సాహును తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని కుర్థా జిల్లా కాళీకోట్ గ్రామానికి చెందిన సంగీతా సాహు గత నాలుగు సంవత్సరాల నుంచి గంజాయి అక్రమ వ్యాపారం చేస్తోంది. అనేక రాష్ట్రాల వ్యాపారులకు గంజాయిని సరఫరా చేస్తూ పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతోంది. ఈ క్రమంలోనే గతంలో హైదరాబాద్‌లోని ధూల్‌పేటలో ఇద్దరికి 41.3 కేజీల గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడింది.
ధూల్‌పేట్‌లో శీలాబాయ్, నేహబాయ్, ఇష్‌కాసింగ్‌తోపాటు మరి కొంత మందికి గంజాయిని సరఫరా చేసినట్లు పట్టుబడింది. ఈమేరకు నిందితులు ఇచ్చిన వాగ్మూలంతో సంగీతపై ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆమెపై నగరంలో మొత్తం ఐదు కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్టు చేయడానికి ప్రత్యేక టీమ్ ఒడిశా చేరుకుంది. స్థానిక పోలీసుల సహకారంతో సంగీతా సాహును అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకువచ్చారు. కాగా సంగీతా సాహును ఒడిశా వెళ్లి అరెస్టు చేసిన ప్రత్యేక బృందాన్ని ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి అభినందించారు.