భద్రాచలంలో ఘోరం జరిగింది. నిర్మాణంలోని ఆరు అంతస్థుల భవనం (Bhadrachalam Building Collapse) కుప్ప కూలిపోగా నలుగురికి పైగా మృత్యవాత పడట్టు సమాచారం. ఈ దుర్ఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. టూ ప్లస్ వన్ భవనం నిర్మాణానికి అనుమతి తీసుకుని ఫైవ్ ప్లస్ వన్ తో అపార్ట్మెంట్ను నిర్మిస్తుండగా ఈ విషాదం జరిగింది.
రియల్ ఎస్టేట్ పాపం పండింది. కానీ భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల ఆధారం కూలిపోయింది. ఈ భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చిన కొత్తగూడెం పట్టణ అభివృద్ధి సంస్థ భద్రాచలం మున్సిపాలిటీ అధికారులందరూ దోషులే.
కుడా వైస్ చైర్మన్, బీఎంసీ కమిషనర్, టౌన్ ప్లానర్, బిల్డింగ్ ఇన్స్ పెక్టర్ సహా అందరూ జైలుకు వెళ్లేందుకు అర్హులే. చూద్దాం పాలకులు ఏంచేస్తారో? మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించి.. అసలు సమస్యను పక్కదోవ పట్టిస్తారో? లేక నిజాన్ని నిజాయితీగా నిరూపిస్తారో.. చూద్దాం.
పీఠం పేరుతో ఓ అర్చకుడు మఠం నిర్మించాలని భావించి అత్యాశకు పోయి ఓ నాశిరకం నిర్మాణం చేయడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అమ్మవారి పేరుతో ఓ అర్చకుడు ఓ పాతభవనంపై మరో నాలుగు అంతస్థులు కొత్త భవనాన్ని నిర్మిస్తుండగా గత ఏడాది పంచాయతీ సిబ్బంది అడ్డుకున్నారు.అనుమతులు లేకుండా ఎలా నిర్మిస్తారని ప్రశ్నించడంతో అప్పటి నుంచి నిర్మాణం నిలిచిపోయింది.
ఆ సమయంలో పంచాయతీ సిబ్బందితో సదరు వ్యక్తి దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. పీఠం పేరుతో పెద్ద ఎత్తున విరాళాలు సేకరించడమే కాకుండా అమ్మవారి ఆలయాన్ని నిర్మించి ఆ ఆలయం పక్కనే ఈ అరు అంతస్థుల భవనాన్ని నిర్మించారు. ఒక వేళ భవనం ప్రారంభోత్సవమై భక్తులు ఉండి ఉంటే పెద్దఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.