హైదరాబాద్‌కు చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్‌కుమార్(Pastor Praveen) మృతి చెందిన సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద రోడ్డు పక్కన ప్రవీణ్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ మృతి చెందలేదని, హత్యేనని పాస్టర్లు ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మీడియాతో మాట్లాడారు.
ఎస్పీ ఏమన్నారంటే..?
‘‘రోడ్డు పక్కన మృతదేహం పడి ఉందని మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహం పక్కనే సెల్‌ఫోన్ గుర్తించారు. చివరి ఫోన్ కాల్ రామ్మోహన్ ఆర్‌జేవైకి వెళ్లినట్టుగా ఉంది. పోలీసులు ఆయనకు ఫోన్ చేయగా.. రామ్మోహన్, అతని భార్య ఘటనాస్థలికి చేరుకుని ఆ మృతదేహం ప్రవీణ్‌దిగా గుర్తించారు. ప్రవీణ్ హైదరాబాద్‌లో ఉంటారని, వివిధ ప్రాంతాల్లో మత బోధకుడిగా సేవలందిస్తారని తెలిపారు. దీంతో హైదరాబాద్‌లో ఉన్న ఆయన కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాం. ప్రవీణ్ బావమరిది నిన్న సాయంత్రం వచ్చి అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు ఇవ్వడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశాం.
ఘటనా స్థలిలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో కొన్ని ఆధారాలు సేకరించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌తో విచారణ జరిపించాలని నిర్ణయించాం. టీమ్ ఆఫ్ డాక్టర్స్‌తో పోస్టుమార్టం చేయించాం. ఈ ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్ చేయించాం. కొవ్వూరు టోల్ గేట్ సమీపంలో ప్రవీణ్ ద్విచక్రవాహనంపై వెళ్తున్నట్టు సీసీటీవీ ఫుటేజ్ సేకరించాం. సోమవారం రాత్రి 11.43 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగినట్టు సీసీటీవీ ఫుటేజ్‌ని బట్టి తెలుస్తోంది. మాకు లభ్యమైన ఆధారాలపై లోతుగా దర్యాప్తు చేస్తాం. కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం. ఈ కేసుకు సంబంధించి ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే ఇవ్వాలని కోరుతున్నాం. పోస్టుమార్టం అనంతరం ఆందోళనకారులను ఒప్పించి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించాం’’ అని ఎస్పీ తెలిపారు.