హైదరాబాద్‌కు చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్‌కుమార్(Pastor Praveen) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద రోడ్డు పక్కన ప్రవీణ్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ మృతి చెందలేదని, హత్యేనని పాస్టర్లు ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు (CM Chandrababu) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పాస్టర్ మృతి ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని డీజీపీని ఆదేశించారు.
తాజాగా ఈ ఘటనపై ఏపీ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల(YS Sharmila) ఎక్స్ వేదికగా స్పందించారు. “పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది రోడ్డు ప్రమాదం కాదని.. సంఘటన స్థలంలో ఇది హత్య అనడానికి చాలా రుజువులు ఉన్నాయని .. ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్యే అని వారి కుటుంబ సభ్యులతో పాటు అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఈ దారుణ ఘటన తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవీణ్ పగడాల గారి మృతిపై వెంటనే ఫాస్ట్రాక్ విచారణ జరిపించాలి. నిజాలు నిగ్గు తేల్చాలి. ప్రవీణ్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను” అని తెలిపారు.