ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. భువనేశ్వరి పర్యటన సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలతో కలిసి భువనేశ్వరి కోలాటం ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు చంద్రబాబు చేస్తున్న కృషిని వివరించారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా తయారై మరో పది మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకోవాలన్నారు. ఇందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మహిళలు ముందడుగు వేస్తే అద్భుతాలు సాధించగలరని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తున్నామని వివరించారు. స్వయం ఉపాధికి చేయూత అందిస్తున్నామని పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గం పరిధిలో పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న తరహా పరిశ్రమలు కూడా రాబోతున్నాయని వెల్లడించారు. ఈ పరిశ్రమల్లో పని చేయడం ద్వారా మహిళలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని భువనేశ్వరి వెల్లడించారు.