Tuesday, April 1, 2025
Homeపాలిటిక్స్Rachamallu: వివేకా కేసులో అవినాష్‌ను ఇరికించడమే చంద్రబాబు లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

Rachamallu: వివేకా కేసులో అవినాష్‌ను ఇరికించడమే చంద్రబాబు లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

వైయస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డిని ఏదోఒకలా ఇరికించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి (Former MLA Rachamallu Sivaprasad Reddy)మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ కడప జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో వైయస్‌ జగన్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు నిత్యం విషం చిమ్మే తప్పుడు వార్తలను రాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకాను హత్య చేసిన నిందితులు దస్తగిరి, సునీల్‌లు చంద్రబాబు చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయారని ధ్వజమెత్తారు. ఈ కేసులో వైయస్ అవినాష్‌రెడ్డి నిందితుడని న్యాయస్థానం తీర్పు చెబితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే…

- Advertisement -

వివేకానంద‌రెడ్డి హ‌త్య జ‌రిగి ఆరేళ్ల‌యినా టీవీ సీరియ‌ల్‌ మాదిరిగా తెలుగుదేశం పార్టీ దానిని తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూనే ఉంది. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని త‌ప్పుడు క‌థ‌నాలు అచ్చేయిస్తూనే ఉంది. ఒక‌ప‌క్క కేసును సీబీఐ ద‌ర్యాప్తు చేస్తోంది, అయినా కూడా ఎల్లో మీడియా “అవినాశ్ డైరెక్ష‌న్… పీఏ కృష్ణారెడ్డి యాక్ష‌న్” అని రాస్తున్నారంటే చంద్రబాబు ఎంతగా రాజకీయ కక్షలతో ఉన్నారో అర్థమవుతోంది. ఈ ఘటనలో వైయస్ జ‌గ‌న్ వ్య‌క్తిత్వాన్ని హ‌న‌నం చేసే కుట్ర‌ల్లో భాగంగా ప‌దే ప‌దే ఎంపీ అవినాశ్ రెడ్డి మీద త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. త‌ద్వారా జ‌గ‌న్‌ని, వైయ‌స్సార్సీపీని రాజ‌కీయంగా ఇబ్బంది పెట్టాల‌నేదే వారి అసలు లక్ష్యం.

రెండో వివాహం కోణంలో విచార‌ణ జ‌రగ‌డం లేదు
వివేకా రెండో వివాహం కోణంలో పోలీసులు విచార‌ణ చేయ‌డం లేదు. ముస్లిం యువ‌తికి పుట్టిన బిడ్డ‌ వివేకా కొడుకా? కాదా? అని డీఎన్ఏ టెస్టు ఎందుకు చేయ‌లేదు? బెంగ‌ళూరులో రియ‌ల్ ఎస్టేట్ లావాదేవీల‌కు సంబంధించిన కోణంలో కూడా విచార‌ణ చేయ‌డం లేదు. ఎంత‌సేప‌టికీ అవినాశ్ చుట్టూ ఉచ్చు ప‌న్నాల‌ని ధ్యేయం త‌ప్ప ఇంకోటి లేదు. జ‌గ‌న్‌ను ఎవ‌రైనా అభిమానిస్తే వారిని ఏదో విధంగా వేధించ‌డ‌మే చంద్ర‌బాబు ల‌క్ష్యం. వివేకా హ‌త్య కేసును అడ్డం పెట్టుకుని తెర‌వెనుక ఉండి చంద్ర‌బాబు ఆడించే ఆట‌లో సునీత పావుగా మారిపోయారు. ఆమె ద్వారా ద‌స్త‌గిరి, సునీల్ కుమార్ కూడా చంద్ర‌బాబు చెప్పింద‌ల్లా చేస్తున్నారు. వివేకాను అత్యంత దారుణంగా న‌రికి చంపిన వ్య‌క్తుల‌తో చంద్ర‌బాబు అప్రూవ‌ర్‌గా మార్చి సెటిల్మెంట్లు చేయిస్తున్నారు. చంద్ర‌బాబు ఆడే రాజ‌కీయ క్రీడ‌లో పావుగా మారి తండ్రిని చంపిన వ్య‌క్తుల‌తో సునీత‌రెడ్డి చేతులు క‌లిపారు.

ఎల్లో మీడియా దుర్మార్గానికి అంతే లేదు
తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్న ఏబీయ‌న్‌, ఆంధ్ర‌జ్యోతి, ఈనాడు, మ‌హాన్యూస్, టీవీ5 వంటి ఛానెళ్లు, పేప‌ర్లు క‌లిసి వైయస్ కుటుంబంపై ప్రచురిస్తున్న కుట్రపూరిత కథనాలతో వారి కుటుంబ గౌరవాన్ని పలుచన చేస్తున్నారు. వివేకా హత్య కేసులో కావాలని ఎల్లో మీడియా చేస్తున్న ఆరోపణలతో ఎంపీ అవినాష్‌రెడ్డి ఎంత క్షోభకు గురవుతున్నారో వారికి అవసరం లేదు. త‌మ అబ‌ద్ధాలను, తప్పుడు ప్ర‌చారంతో సీబీఐ స‌హా అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మీడియా ద్వారా నిత్యం అబ‌ద్ధాలు మాట్లాడిస్తున్నారు. పోలీసులు కూడా ప్ర‌భుత్వం ఏది చెబితే దానికి డూడూ బ‌స‌వ‌న్న చందంగా త‌ల ఊపుతున్నారు.

సినిమా క్లిప్పింగ్ పోస్ట్ చేసిన పవన్‌పై కేసు దారుణం
సెన్సార్ స‌ర్టిఫికెట్ తెచ్చుకుని రిలీజైన “హ‌త్య” సినిమాలో ఒక స‌న్నివేశాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తే వైయ‌స్సార్సీపీ కార్య‌క‌ర్త ప‌వ‌న్ కుమార్ రెడ్డిపై కేసు బనాయించారు. విచార‌ణ పేరుతో స్టేష‌న్‌కి పిలిపించి కొట్టారు. వివేకాను తామే దారుణంగా న‌రికి చంపామ‌ని నేరాన్ని అంగీక‌రించిన నిందితులు ద‌స్త‌గిరి, సునీల్ కుమార్ అనే వ్య‌క్తులు ఫిర్యాదు చేస్తే ప‌వ‌న్ కుమార్ మీద పోలీసులు కేసు న‌మోదు చేశారంటే నిందితుల‌కు ఈ ప్ర‌భుత్వం ఎంతగా కొమ్ముకాస్తోందో అర్థమవుతోంది. వివేకా హ‌త్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ కుమార్‌ మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయ‌ని చెబితే పోలీసులు ప‌వ‌న్ కుమార్‌ను కొట్ట‌డం కన్నా దారుణ‌మైన అంశం ఇంకోటి ఉండ‌దు. ఈ సినిమా ద్వారా వివేకా హ‌త్య‌తో అవినాశ్‌కి సంబంధం లేద‌ని ప్ర‌జ‌ల‌కు నిజం తెలిసిపోతుంద‌ని చంద్ర‌బాబు భ‌యం. త‌న‌ను పోలీసులు కొట్ట‌డంపై ప‌వ‌న్ కుమార్‌రెడ్డి పార్టీ అధినేత జ‌గ‌న్‌ను క‌లిసి బాధ‌ను వెళ్ల‌బోసుకుంటే ఆంధ్ర‌జ్యోతిలో “ప‌వ‌న్‌తో జ‌గ‌న్ గూడుపుఠాని” అంటూ త‌ప్పుడు వార్త‌ అచ్చేశారు. ఇంతగా ఎల్లో మీడియా దిగజారి వ్యవహరిస్తోంది.

ద‌స్త‌గిరి, సునీల్ కుమార్‌ల‌కు రూ.కోట్లు ఎలా వ‌చ్చాయి?
వివేకా హ‌త్యకు ముందు ద‌స్త‌గిరి, సునీల్ కుమార్‌లు రూ. 500 కోసం కూడా చేయి చాపేవారు. అలాంటిది ఇప్పుడు కోట్ల‌కు ప‌డ‌గలెత్తి జ‌ల్సాలు చేస్తున్నారంటే వారికి ఆ డ‌బ్బులు ఎలా వ‌చ్చాయి? తాము చెప్పింద‌ల్లా చేసినందుకు, చెప్పిన మాట‌ల్ని మీడియాలో మాట్లాడినందుకు సునీత‌రెడ్డి, న‌ర్రెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, చంద్ర‌బాబులే వారికి డ‌బ్బులిచ్చి పోషిస్తున్నారు. వారి త‌ర‌ఫున దేశంలోనే ఖ‌రీదైన సుప్రీంకోర్ట్ న్యాయవాదులు హాజరై వాదనలు వినిపిస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతకేసులను వాదించిన సుప్రీంకోర్ట్ న్యాయవాదులే వీరిద్దరి కేసులను వాదిస్తున్నారంటే దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందో అందరికీ అర్థమవుతోంది. సునీత‌రెడ్డి, చంద్ర‌బాబు నాయుడు నిందితుల ప‌క్షాన నిల‌బ‌డి ప్రోత్స‌హిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News