మయన్మార్, థాయిలాండ్ దేశాలు భారీ భూకంపంతో(Earthquake) వణికిపోయాయి. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి పెద్ద పెద్ద భవనాలు సైతం నెలకొరిగాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. భూకంపం ధాటికి మయన్మార్‌లో దాదాపు 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇక థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో కూలిపోయిన ఓ భవనం శిథిలాల్లో 43 మంది చిక్కుకుపోయారు. అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. భూకంపం ధాటికి ప్రజలు భయాందోళనకు గురైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రెండు దేశాల్లో సంభవించిన భారీ భూకంపంపై భారత ప్రధాని మోదీ(PM Modi) స్పందించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భూకంపంలో చిక్కుకున్న ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో అవసరమైన తోడ్పాటు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. సహాయ చర్యలపై బాధిత దేశాలను సంప్రదించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించారు.