హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో 4వ కియో నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్(Karate Championship) 2025 ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు స్పీకర్ ప్రసాద్, మంత్రి పొన్నంకు గౌరవార్థం కరాటే బ్లాక్ బెల్ట్‌ను ప్రదానం చేశారు. కరాటే బెల్ట్‌లు అందుకున్న వెంటనే ఇద్దరు నేతలు కరాటే పోటీ పడుతున్నట్లు ఫోటోలకు ఫోజులిచ్చారు.
ప్రజాజీవితంలో నిత్యం విమర్శలు, ప్రతివిమర్శలతో బిజీగా ఉండే రాజకీయ నాయకులు కరాటే రింగ్‌లో తలపడుతున్నట్టుగా కనిపించడంతో సభా ప్రాంగణం కాసేపు సందడిగా మారింది. కాగా మూడురోజుల పాటు కొనసాగనున్న ఈ కియో నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్ ప్రారంభోత్సవానికి భారత బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ హాజరవ్వడం మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా వేలాది మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.