సాహితీ లోకంలో ‘కరుణశ్రీ’ అనే కలం పేరుతో ప్రసిద్ధుడైన జంధ్యాల పాపయ్య శాస్త్రి ఏ గ్రంథం రాసినా అది లక్షల సంఖ్యలో అమ్ముడుపోతుంది. ఆయన రచనా పాటవం, ఆయన సృజనాత్మకత, ఆయన ప్రజాకర్షణ అటువంటివి. ముఖ్యంగా ఆయన రాసిన ‘ఉదయశ్రీ’, ‘విజయశ్రీ’, ‘కరుణశ్రీ’ గ్రంథాలు ఎన్ని ప్రతులు ఎన్నిసార్లు ప్రచురితమయ్యాయో, ఎన్ని ప్రతులు అమ్ముడుపోయాయో లెక్కలేదు. 1912 ఆగస్టు 4న జన్మించి 1992 జూన్ 21న కాలం చేసిన పాపయ్య శాస్త్రి తన జీవిత కాలంలో 27 ప్రసిద్ధ రచనలు చేశారు. ఆయన తన ప్రతి రచనలోనూ నవరసాల్లో ఒకటైన కరుణ రసాన్ని అద్భుతంగా పండించడంతో ఆయన సార్థక నామ(కలం)ధేయుడయ్యారు. ఆయన కావ్యాలైన ‘పుష్ప విలాపం’, ‘కుంతీ కుమారి’ పూర్తిగా కరుణ రసంతో నిండి ఉంటాయి.
సమాజ స్థితిగతులను చూసి మనసులో కలిగే స్పందనే కవిత్యం అని పూర్తిగా నమ్మే కరుణశ్రీ తన గ్రంథాల్లో సామాజిక స్థితిగతులనే ప్రతిఫలించారు. ఆయన ఇదే స్పందనతో, సామాజిక స్పృహతో రాసిన ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ గ్రంథాలు అటు సాహితీవేత్తలలోనే కాక, ఇటు విభిన్న సామాజిక వర్గాలలో కూడా కనీవినీ ఎరుగని విధంగా చర్చనీయాంశాలయ్యాయి. అవి పాఠ్యపుస్తకాలుగా, సినీ గీతాలుగా పాఠకాదరణ పొందాయి. ఎన్నో పురస్కారాలు అందుకున్నాయి. తెలుగునాట సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఇందులో ఉదయశ్రీ తనకు పరిమళాత్మక హృదయమని, విజయశ్రీ తన మానసిక దృక్పథమనీ, కరుణశ్రీ తన విలువలతో కూడిన విలువైన జీవితమనీ ఆయన అభివర్ణించారు. ఈ గ్రంథాలు ఆయనకే కాక, యావత్ సాహితీ ప్రపంచానికి సత్యం, శివం, సుందరంగా కట్టెదుట సాక్షాత్కరించాయి. ఇందులో ఉదయశ్రీ మనలను చీకట్లోంచి సాయం వెలుగులోకి తీసుకు వెడుతుంది. విజయశ్రీ సాయం వెలుగు నుంచి సూర్యకాంతికి నడిపిస్తుంది. కరుణశ్రీ సూర్యకాంతి నుంచి కరుణలోకి, బ్రహ్మానందంలోకి తీసుకు వెడుతుంది.
కరుణశ్రీ రాసిన ప్రతి పద్యకావ్యం పాఠకుల్ని ఉన్నత స్థాయి ఆధ్యాత్మిక చింతనకు దారి చూపిస్తుంది. అదే సమయంలో సమాజంలోని కష్టనష్టాలు, దుస్థితుల లోతుల్లోకి తీసుకు వెడుతుంది. ఆ తర్వాత సామాజిక సమస్యలకు కొన్ని పరిష్కార మార్గాలను చూపిస్తుంది. శాంతి, సామరస్యం, సహజీవనం వంటి గుణాలతో జీవించడాన్ని నేర్పిస్తూనే, సామాజిక న్యాయాన్ని, మానవతా విలువల్ని రంగరించి పోస్తుంది. ఆయన రచనలను ఆసాంతం ఔపోశన పట్టినవారికి ఆయన సంప్రదాయానికి, ఆధునికతకు వారధిగా కనిపిస్తారు. సామాజిక స్పృహకు, ఆధ్యాత్మిక చింతనకు ఆయన తన రచనల ద్వారా పొంతనను సృష్టిస్తారు. ఆయనను బమ్మెర పోతనతో పోల్చిన సాహితీవేత్తలు కూడా ఉన్నారంటే అందులో అతిశయోక్తేమీ లేదు.
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామంలో జన్మించిన పాపయ్య శాస్త్రి తన భాషతో, తన సాహిత్యంతో పామర జనానికి కూడా బాగా దగ్గరయ్యారు. ఆయన సాహిత్యానికి సంబంధించిన అన్ని విభాగాలను స్పృశిస్తూనే, గీత రచయితగా కూడా ప్రసిద్ధి చెందారు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, పుష్పవిలాపం, కుంతీకుమారిలతో పాటు ఆయన ఒమర్ ఖయాం, అరుణ కిరణాలు, తెలుగు బాల, కల్యాణ కల్పవల్లి తదితర రచనలు కూడా చేశారు. ప్రతి రచనా సమాజ సమస్యల పట్ల ఆయన మానసిక స్పందనే అనుకోవచ్చు. ఒక పారిశుధ్య కార్మికురాలి బాధలను చూసి ఆయన ‘పాకీ పిల్ల’ అనే రచన చేశారు. ఆయన 16 ఏళ్ల వయసులోనే ఈ రచన చేయడం విశేషం.అదే విధంగా ఓ వ్యక్తి ఒక పూలతోటలోకి జొరబడి ఇష్టం వచ్చినట్టు పూలను తెంపడంపై స్పందించి ఆయన పుష్ప విలాపం రచించారు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, పుష్పవిలాపం, కుంతీకుమారి వంటి రచనల నుంచి కొన్ని పద్యాలు, గేయాలు సినిమాల్లోకి పాటల రూపంలోకి వెళ్లాయి. మరికొన్ని ప్రైవేట్ పాటలుగా కూడా రికార్డులుగా మారాయి. ఈ పాటలను ఘంటసాల గొంతు ద్వారా వింటున్నప్పుడు ఎవరికైనా హృదయం ద్రవించక మానదు.
ఉగాది ఉత్సవాల సందర్భంగా ప్రదర్శించే ‘భువన విజయం’ అనే సాంస్కృతిక కార్యక్రమంలో ఆయన నంది తిమ్మనగా నటించేవారు. విచిత్రమేమిటంటే, ఆ కార్యక్రమంలో ఆయన మేకప్ వేసుకోకుండా సహజంగా కనిపించేవారు. ఆయన తెలుగు సాహిత్య అకాడమీ అవార్డుతో సహా అనేకానేక పురస్కారాలు అందుకున్నారు.