తెలుగు సాహిత్యంలో ‘భాకవిత్వం’ ఒక ప్రత్యేక మైన ఒరవడిని, ఊపును కొత్త రూపును తీసుకొచ్చింది. ఆంగ్ల సాహిత్యంతో ప్రభావమైనప్పటికీ తెలుగు సాహిత్యంలో ‘భావ కవిత్వం’ ఊడలు చాచిన మర్రిలా విస్తరించింది. ఆ కాలంలోను మరియు నేటికి కూడా ఎంతో మందిని ప్రభావితం చేయగల్గింది, చేస్తుంది కూడా. కందుకూరితో మొదలుకొని మహాకవి గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు విశ్వనాధ సత్య నారాయణ, బసవరాజు అప్పారావు, పింగళి కాటూరి కవులు, నండూరి సుబ్బారావు, దువ్వూరి రామిరెడ్డి, అడవి బాపిరాజు, వేదుల సత్యనాయణ శాస్త్రి మొదలైన వారం దరు భావ కవిత్వపు ‘టానిక్’ ను ఆస్వాదించి గొప్ప గొప్ప రచనలు చేశారు. వీరిలో ముందు వరుసలో ఉండేవారు ‘దేవులపల్లి కృష్ణశాస్త్రి’ అందుకే మహాకవి గురజాడ అప్పా రావు గారిని ఉద్దేశించి భావకవిత్వానికి ఆధ్యుడు ‘గురజాడే’ వారి అడుగు జాడలే ‘భావ కవిత్వం అంటారు శ్రీశ్రీ. ఆంగ్ల కాల్పనిక కవిత్వం నుండి దిగుమతి చేసుకో డిందే భావ కవిత్వం. భాకవిత్వం అంటే కృష్ణశాస్త్రి, కృష్ణశాస్త్రి అంటేనే ‘భావ కవిత్వం‘ అనే స్థాయికి వెళ్ళింది ఆ కాలంలో, కృష్ణశాస్త్రి రచనలు గేయనాటికలు:- శర్మిష్ఠ, కృష్ణాష్టమి, యమునావిహారి, ఏడాది పొడుగునా, గౌతమి, వేణుకుంజం, ధనుర్దాసు (సంపుటి) ఖండకావ్యాలు:- కృష్ణపక్షం, ప్రవాసం ఊర్వశి, పల్లకి, నిశ్రేణి, బ్రహ్మసమాజ కృతులు:- మహతి, పద్యావళి, ఋగ్వీధి (అనువాదం) సంగీత రూపకాలు:- అతిధిశాల, కొత్తకోవెల, రాజఘట్టం, చౌరస్తా, ఋతుచక్రం. వచన రచనలు:- అప్పుడు పుట్టి ఉంటే (వ్యాససంపుటి), ఏకాంతసేవ పీఠిక, పాతిక సంవత్సరాల తెలుగు కవిత్వం (భారతి పత్రికలో ప్రచురితం), బసవరాజు అప్పారావు మధురస్మృతి (వ్యా సం), అన్నమాచారి, బహుకాలదర్శనం (సంపుటి), పుష్పలావికలు (సంపుటి) గీత సంహిత:- లలిత గీతాలు, సినీగీతాల సంపుటి ’మేఘమాల’, యక్షగానం:- శ్రీ విప్రనారాయణ, అనువాదం:- తిరుప్పావు,
వీరు తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం దగ్గర పల్లెటూరిలో 1897 నవంబర్ 1 న జన్మించారు. ఆ కాలం లోనే బి.ఏ. వరకు చదివి కొంతకాలం పెద్దాపురం మిషనరీ హై స్కూల్ లో అధ్యాపకుడిగా పనిచేశారు. ఆంగ్ల కవిత్వంలో ప్రసిద్ధి పొందిన పి.బీ. షెల్లీ గారితో కృష్ణశాస్త్రిని పోల్చటం ముదావహం. అందుకే ‘తెలుగు పెల్లి’ లేదా ‘ఆంధ్రా పెల్లి’గా కూడా వీరిని పిలుస్తారు. 20వ శతాబ్దపు ప్రారంభంలో అసాధారణమైన సాహిత్యపు ప్రతిభా పాట వాలను ప్రదర్శించి తెలుగు సాహిత్యంపై చెరగని ముద్రవే శారు. ‘భావ కవిత్వానికి’ పట్టుకొమ్మవలే పలు సృజనాత్మక రచనలు చేసిన కృష్ణశాస్త్రి ‘భావ కవితోద్యమానికి’ మరియు మలిదశలో ఇతర కవులకు దిక్సూచిలా నిలబడి దారి చూయించారు. కృష్ణశాస్త్రి కవిత్వంలో స్వేచ్ఛా ప్రియత్వం, వేధనా ప్రియత్వం, ప్రేమ, ఈశ్వరారాధన భావం, ప్రధాన లక్షణాలని విమర్శకుల అభిప్రాయం, ఒక తత్త్వానికి, ఒక ఇజానికి కట్టుబడి ఉండకుండా కవిత్వాన్వేషణను పరమ సంకల్పంగా ఎంచుకున్న తీరు ఆయన రచనల్లో కనిపిస్తుంది. ఒకానొక (ప్రారంభంలో) దశలో మహాకవి శ్రీశ్రీ భావకవిత్వాన్ని రాస్తే కృష్ణశాస్త్రిని కాపీ కొడుతున్నారని అన్నవారు లేకపోలేదు ఆనాటి రోజుల్లో. అంటే కృష్ణశాస్త్రి భావకవిత్వం ఎంతమందిని ప్రభావితం చేసిందో గమనించవచ్చును.
‘వైతాలికులు’ సంకలనంలో ముద్దు కృష్ణ గారు చక్క గా కృష్ణశాస్త్రి కవిత్వాన్ని అంచనా వేశారు. ‘శిల్పి, గాయకుడు, కవిత్వంలో కూడా సన్నపోగారు చెక్కడంలో మహానిపుణుడు. కీట్స్ పల్లీల పదాల కూర్పు ఆంగ్ల కవిత్వానికి ఎటువంటి నూతన శోభ కూర్చిందో తెలుగు కవిత్వానికి, కవిత్వ భాషకు వీరి కృషి అటువంటిది. ఊహా తీతమైన దేనికో అర్రులుచాచే ఆశాజీవి, ఆశయాలలో, అనుభవాలలో, కొత్తదనము, విశేష ప్రత్యేకత ఉన్నవాడు, ప్రేమకై విదాహం పొందాడు, విరహంలో వేగిపోయాడు ఈ అనుభవాలను శాశ్వత శిల్పాలుగా నిర్మించాడు, కవి త్వం కోసం బ్రతికాడు మంచి రుచి గలవాడు కవిత్వాన్నే స్వాసించాడు అని అనటంలో ఆశ్చర్యం ఏంలేదు.
కృష్ణశాస్త్రి గారి తొలి రచన ‘కృష్ణ పక్షం‘ నిజానికి ఇదొక ‘క్లాసిక్” రచన కవితా శక్తుల్ని తెల్పుకోదగిన వారు, కవిత్వం గూర్చి తెలిసిన సాహిత్యప్రియులు, పరిశోధకులు తప్పక చదవాల్సిన కావ్యం ఇది. ఖండ కావ్యం యొక్క గొప్పతనాన్ని, కాల్పనికోద్యమంలో కూడా దాని యొక్క ప్రాశస్త్యాన్ని విడమరచి చెప్పిన రచన ఇది. ఇందులో అరవై ఖండికలు కలవు. దీనిని 1921-25 సంవత్సరాల మధ్య కాలంలో రచించినట్లు, అలాగే సాహితీ సమితి తరుపున శ్రీ తల్లావఝుల శివశంకరశాస్త్రి ప్రచురించారు. ‘నవ్య కవులకు‘ స్వేఛ్చ ప్రాణం వంటిది. దీనిని మహారాజ రావు వెంకట కుమార మహీపతి సూర్యారావు బహద్దూరుకు అంకితం ఇచ్చారు. కృష్ణపక్షంలోని ఓ కవితను చూద్దాం.
నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు? నాయియే గాక నాకేటివెఱపు ? కలవిహంగము పక్షములు తేలియాడి తారకామణులలో తారనైమెలగి మాయమయ్యెదను నా మధురగానమున నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు?
ఇది కృష్ణశాస్త్రి గారి ‘స్వేచ్ఛగానం’ కవిత అన్న విష యం సాహిత్య ప్రియులందరికీ తెలిసినదే. ఇందులో కాల్ప నిక కవిత్వం, స్వేచ్ఛా ప్రవృత్తి, మూర్తిభవిస్తున్నది. కొంతమంది విమర్శకులు కృష్ణశాస్త్రిని పలాయన వాదిగా వ్యాఖ్యానించినప్పటికి అది ఎక్కువ కాలం నిలబడ లేదు.
శోక భీకరతి మీరలోకైక పతిని!
ఎవ్వరని యెంతురో నన్ను? ఏననంత నాకు విశ్వా సతాళ వృంతాలు గలవు. నాకు కన్నీటి సరుల దొంతరలు గలవు. నా కమూల్య మపూర్వ మానందమొసగు నిరపమ నితాంత దుఃఖంపు నిధులు గలవు. ఎవ్వరని యెంతురో నన్ను? మూగవోయిన నా గళమ్మునను కూడా నిదరవో యిన సెలయేటి రొదలు గలవు
‘ఆత్మశ్రయత్వం’ అనేది కాల్పనిక కవుల ప్రధాన లక్ష ణాల్లో ఒకటి. పై కవితలో కూడా ‘ఆత్మశ్రయత’ ప్రధానం గా కన్పిస్తుంది. దానికి సమాంతరంగా కాల్పనికత్వం ప్రయాణం చేస్తుంది. కృష్ణశాస్త్రి గారి ఊహాప్రేయసి ‘ఊర్వశి‘, కాళిదాసు వర్ణనలో, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి కవితల్లో కాల్పనికంగా వెలుబడిన ‘ఊర్వశిని‘ అపూర్వమైన రీతిలో సృజించారు కృష్ణశాస్త్రి. డా. సినారె గారు తన సిద్ధాం త గ్రంధమైన ‘ఆధునిక కవిత్వం సంప్రదాయం ప్రయోగాలు’లో కృష్ణశాస్త్రి అభిప్రాయాల్ని తనయొక్క స్వంత వ్యాఖ్యాల్ని మేళవిస్తు ‘ఊర్వశిని’ గురించి వివరిం చారు. పురాణ గాధలలోని ఊర్వశి ఋషులను పదభ్రష్టు లను జేయుటకు ఉపయోగపడినది.
తెలుగు కావ్యములలో ఎవ్వరు కూడా ‘ఊర్వశి’ని కావ్య వస్తువుగా గ్రహించలేదు. ‘ఉత్తర హరివంశము’లో నాచన సోముడు ఊర్వశిని ‘సంతనెన్నడో జవ్వన మమ్ము కొన్న గడసానిగా’అంటూ పచ్చి పచ్చిగా చిత్రీకరించినాడు.
కృష్ణశాస్త్రి తెలుగు సాహిత్య చరిత్రలో భావకవిత్వానికి ఆధ్యుడు, ఆరాధ్యుడు కూడా. ఐతే అప్పటి బావకవిత్వం లోని నవ్వకవుల భాష, అభివ్యక్తి వస్తువులు సంప్రదాయపు పండితులకు ఆగ్రహం కల్గించాయి. ఈ రకమైన కవి త్వాన్ని (భావకవిత్వం) తీవ్రంగా విమర్శిస్తూ ‘అక్కిరాజు ఉమాకాంతం’ అనే కవి ‘నేటి కాలపు కవిత్వం‘ పేరుతో ఒక విమర్శ గ్రంథాన్ని రచించారు. భావ కవులు దీనికి ప్రతి విమర్శ రాయలేదు. కూడా. అందుకే ఈ దశలో కృష్ణశాస్త్రి భావకవులందరికి నాయకుడయ్యాడు. అందుకే శ్రీశ్రీ మాటల్లో నేటి కాలపు కవిత్వం లైబ్రరీలో బూజుపట్టి పోయింది. కృష్ణశాస్త్రి కవిత్వం భావ కవిత్వానికి పరాకా ష్టగా నిలిచింది అనడంలో సందేహం లేదు.
నేను హేమంత కృష్ణానంత శర్వరిని
‘నా కుగాదులు లేవు నా కుషస్సులు లేవు నాకు కాల మ్మొక్కటే కారురూపు నా శోకమ్ము వలెనె, నా బ్రతుకువలె, నావలెనె‘
అని ఆక్రోశాన్ని పతాకస్థాయికి, తీసుకొని వచ్చింది. భావ కవిత్వంలో ఇదొక ముఖ్యమైన స్థితి ఐనప్పటికీ ‘మరణవాంచ’ లేదా ‘ఆత్మత్యాగం’ దీనికి భయపడని కవి తత్త్వం స్పష్టంగా గమనించవచ్చు
‘ఏను మరణించుచున్నాను; ఇట నశించు నా కొఱకు చెమ్మగిలిన నయనమ్ము లేదు నా మరణశయ్య పఱచు కొన్నాను నేనె నేనెనాకు వీడ్కొలుపు విన్పించినాను‘
పై కవితను వ్రాయడానికి ఎంత ధైర్యం వుండాలి ఒక వైపు మృత్యువు సమీపిస్తున్నా దానిని స్వయంగా ఆహ్వానిం చటం గొప్ప విషయం. గొంతు క్యాన్సర్ తో (1963లో) బాధపడిన చివరి రోజులలో మాట్లాడడానికి గొంతు సహ కరించకపోవటం వల్ల కేవలం చిట్టెలపై వ్రాసి ఇచ్చే రోజుల్లో అంతటి విషాదాన్ని దిగమింగుకుని, వ్రాసిన వాక్యాలు అవి.
‘గుడిపాటి వెంకటచలం’ అన్నట్లుగా ‘తన బాధనం తను దేశం బాధగా’ చేసిన గొప్పకవి కృష్ణశాస్త్రి. మిగిలిన కవులు అక్కడక్కడ భావకవిత్వానికి బద్ధులై వ్రాసినప్పటికి కృష్ణశాస్త్రి అంతగా తెలుగు సాహిత్యంపై బలమైన ముద్ర వేయలేకపోయారు. ఏది ఏమైనప్పటికీ ఎవరి సృజనాత్మ కత వారిదే. వారిలో కృష్ణశాస్త్రి విభిన్న సృజనాత్మక సం పన్నుడు. వచన రచనలోను కృష్ణశాస్త్రి రమణీయమైన, అంతర్ణయాత్మకమైన శైలి తన స్వంతం. ‘అప్పుడే పుట్టి వుంటే’ ‘పుష్ప లావికలు’ వంటి వ్యాసాలు దీనికి ఉదాహ రణలుగా చెప్పొచ్చు అలానే 1975లో ఆంధ్ర విశ్వవిద్యాల యం కళాప్రపూర్ణ బిరుదు, 1976లో భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు, 1978లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (6 సంపుటాల రచనల సంకలనం) వీరి సాహిత్య ప్రతిభకు తార్కాణాలు.
ఇక కృష్ణశాస్త్రి గారి సినీగీతాలను గూర్చి వేటూరి సుందర రామ్మూర్తి గారు స్పందిస్తూ ‘కృష్ణశాస్త్రి గారి ముందు తామంతా పగటిచుక్కలమే’ అనటంలో ఎటు వంటి సందేహం లేదు అన్నారు ఒకానొక సందర్భంలో, అదేవిదంగా ‘చెట్టు నా ఆదర్శం’ అన్న అనుభూతి కవి ఇస్మాయిల్ లాంటి వారికి కృష్ణశాస్త్రి ప్రేరణ. 1964 లో మద్రాసు చేరి సినీగేయ రచయితగా కూడ మంచి సాహిత్య సృజన చేశారు. (కొలువైతివా రంగ సాయి, ఇది వెన్నెల మాసమని, మావి చిగురు తినగానే కోవెల పలికేనా, జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి, ముందు తెలిసినా ప్రభు ఈ మందిర మిటులుంచేనా, సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో, గోరింట పూచింది కొమ్మా లేకుండా. అదిగదిగో గగనసీమ, మనసున మల్లెల మాలలూగెనే మొదలైన గొప్ప పాటలు) ‘ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై ఈయడవి దాగిపోనా ఎట్లైన నిచటనే యాగిపోనా‘ అంటూ ప్రకృతిని ప్రేమించి ఆరాధించి, ప్రకృతి ఒడిలో సేదదీరు టకు ‘దిగిరాను దిగిరాను దివి నుండి భువికి’ అంటూ దిగంతాలకు తరలివెళ్ళారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి (1980 ఫిబ్రవరి 24 న) మరణ వార్త విన్న శ్రీశ్రీ స్పందిస్తూ ‘షెల్లీ మళ్ళీ మరణించాడు వసంతం వాడిపోయింది’ అన్నాడు దుఖంతో. తెలుగు సాహిత్య చరిత్రలో కృష్ణ శాస్త్రి లాంటి గొప్ప వ్యక్తి తన తర్వాత తరం కవులకు ఎంతగా ఆదర్శప్రాయుడయ్యాడో భావకవిత్వానికి కూడా అంతగా నీరుపోసి వృక్షంలా పెంచి పెద్దచేసి ‘తోటమాలిగా’ కాపు కాసి తదనంతరం వచ్చిన కవులకు బలమైన బాటనుపరచి తనదైన ముద్రవేసిన గొప్ప వ్యక్తి కృష్ణశాస్త్రి.
డా॥మహ్మద్ హసన్
– 9908059234.