పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేసిన టీచర్ల నియామక కుంభకోణం(Teachers recruitment Scam) వ్యవహారంలో మమతా బెనర్జీ(Mamata Banerjee) ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. 25వేల టీచర్ల నియామకాలు చెల్లవని కలకత్తా హైకోర్టును ఇచ్చిన తీర్పును సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సమర్థించింది. అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్ల నియామకాలు చెల్లవని తేల్చిచెప్పింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు తమకు ఎలాంటి కారణాలు కనిపించడంలేదని అభిప్రాయపడింది.
ఈ కుంభకోణంపై గతేడాది ఏప్రిల్‌లో కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. 2016 టీచర్ల నియామక ప్రక్రియ చెల్లదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఉద్యోగాలు సాధించిన టీచర్లు తమ వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలని వెల్లడించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం ఫిబ్రవరి 10న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా తీర్పు వెలువరించింది. అయితే ఉపాధ్యాయులకు కాస్త ఊరట కల్పించింది. ఈ నియామక ప్రక్రియ కింద ఉద్యోగాలు సాధించిన టీచర్లు అప్పటివరకు అందుకున్న వేతనాలు, ఇతర భత్యాలను తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని వెల్లడించింది. మూడు నెలల్లో కొత్తగా టీచర్ల నియామకాలు పూర్తి చేయాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.