Thursday, April 10, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశం..!

హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశం..!

హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.

- Advertisement -

వర్షాలతో ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని సీఎస్‌ సహా సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఇక వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో, వెంటనే సరి చేసేందుకు ట్రాన్స్‌కో, డిస్కంలు సమర్థవంతంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా విద్యుత్ సరఫరాను యథావిధిగా కొనసాగించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాల్సిందిగా పేర్కొన్నారు.

భారీ వర్షాలతో నగరంలో ట్రాఫిక్ స్థంబించకుండా పోలీసు విభాగం చురుకుగా వ్యవహరించాలని సీఎం సూచించారు. వాహనదారులు ఇళ్లకు త్వరగా చేరేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్ సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్లు పడుతున్న నేపథ్యంలో, అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News