తమ తల్లి విజయమ్మకు సరస్వతి పవర్ షేర్లను వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan) గిఫ్ట్‌డీడ్ కింద ఇచ్చారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తెలిపారు. ఇప్పుడు స్వయంగా తల్లినే జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సరస్వతి పవర్ షేర్ల ఎంవోయూపై జగన్ సంతకం చేశారని చెప్పారు. అలాంటిది ఇప్పటి వరకు ఒక్క ఆస్తి కూడా తనకు ఇవ్వలేదన్నారు. ఇచ్చిన షేర్లు కూడా మళ్లీ తనకే కావాలని ఆయన కోర్టుకు వెళ్లారని వాపోయారు. తల్లిపై కేసు వేసిన కుమారుడిగా.. మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా ఆయన చరిత్రలో మిగిలిపోతారని విమర్శించారు. జగన్‌కు విశ్వసనీయత ఉందో..లేదో.. వైసీపీ వారే ఆలోచించాలని షర్మిల వ్యాఖ్యానించారు.
కాగా కొంతకాలంగా సరస్వతి పవర్ షేర్ల బదలాయింపుపై జగన్, షర్మిల మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌కు వ్యతిరేకంగా షర్మిల పనిచేయడంతో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో గతంలో షర్మిలకు గిఫ్ట్ డీడ్ కింద రాసిచ్చిన సరస్వతి పవర్ షేర్లను తిరిగి వెనక్కి తీసుకుంటున్నాను అంటూ జగన్ నేషనల్ ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ కొనసాగుతోంది.