గత పదేళ్లుగా ఏపీని బీజేపీ మోసం చేస్తూనే ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) మండిపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత విభజన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదని తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
“రాష్ట్ర విభజన తర్వాత విభజన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు. బీజేపీ గత 10 ఏళ్లుగా మోసం చేస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం అంతే ముఖ్యం. పోలవరం ఆంధ్ర జీవనాడి. ఇవ్వాళ్టి వరకు ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. దీనికి బాధ్యత ఎవరు? పోలవరం దివంగత YSR గారి కల. YSR ముఖ్యమంత్రి అయ్యాక అన్ని అనుమతులు తీసుకువచ్చి పనులు ప్రారంభించారు. 7 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు… 22 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యం. YSR పనులు ప్రారంభించినప్పుడు అంచనా వ్యయం రూ.10,151 కోట్లు. ప్రాజెక్ట్ సామర్ధ్యం 194 టీఎంసీలు. ఆనాడు ప్రాజెక్ట్ ఎత్తు 45.7 మీటర్లు. ఇప్పుడు పోలవరం ఎత్తు 41 మీటర్లకు కుదించారు. ఇలా కడితే పోలవరం జీవనాడి అవ్వదు. YSR హయంలో 33 శాతం పనులు అయ్యాయి. ఆ తర్వాత ఎవరు కూడా పోలవరం పనులను పట్టించుకోలేదు.
2014లో కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. 2014లో అధికారంలో వచ్చిన చంద్రబాబు గారు కేవలం 17 శాతం పనులు చేశారు. ప్రాజెక్ట్ అంచనాను అమాంతం రూ.50వేల కోట్లకు పెంచేశారు. ఇక జగన్ గారు అధికారంలో వచ్చాక పోలవరం పనులు 3 శాతం దాటలేదు. తండ్రి ఆశయాన్ని జగన్ ముందుకు తీసుకువెళ్ళలేదు. రివర్స్ టెండర్ల పేరుతో ప్రాజెక్ట్ నాశనం చేశారు. మొత్తంగా 10 ఏళ్లలో 50 శాతం పనులు దాటలేదు. అందరు కలిసి పోలవరం ప్రాజెక్ట్ స్వరూపం మార్చేశారు. జగన్, బాబు ఇద్దరు బీజేపీకి లొంగిపోయారు. 41 మీటర్ల ఎత్తులో మాత్రమే R&R ఇవ్వాలని చూస్తున్నారు. ఫేజ్ 1, ఫేజ్ 2 అంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
41 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే ఎన్ని ఎకరాలకు నీరు ఇస్తారో చెప్పడం లేదు. 41.15 మీటర్లు ఎత్తులోనే నిర్మాణం అని కేంద్రం పోలవరం వెబ్‌సైట్‌లో పెడితే మన ఎంపీలు నోరు మూసుకొని కూర్చున్నారు. ప్రాజెక్ట్ బ్యారేజ్‌గా…లిఫ్ట్ ఇరిగేషన్‌గా మిగిలి పోయే ప్రమాదం ఉంది. ఇది రాష్ట్రంపై బీజేపీ చేస్తున్న కుట్ర. ఈ కుట్రలో భాగం బాబు, జగన్, పవన్. ఫేజ్ 1లో ఎన్ని ఎకరాలు… ఫేజ్ 2లో ఎన్ని ఎకరాలు అనేది కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. పోలవరంలో R&R ప్యాకేజీ ఇవ్వాలి అంటే రూ.33 వేల కోట్లు కావాలి. దాదాపు 96 వేల కుటుంబాలకు ఇంకా రీహాబిలిటేషన్ చేయాలి. 85 వేల కుటుంబాలకు R&R ఇవ్వకుండా ఎత్తు తగ్గించడం కుట్ర. కేవలం 20 వేల కుటుంబాలకు మాత్రమే పరిహారం ఇచ్చి మోసం చేశారు. మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయండి. 45.7 మీటర్ల ఎత్తు కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుంది” అని వెల్లడించారు.