ఈనెల 11న అత్యంత వైభవంగా నిర్వహించే ఒంటిమిట్ట (Ontimitta) శ్రీ సీతారాముల కల్యాణోత్సవ ఏర్పాట్ల పరిశీలన నిమిత్తం సోమవారం ఉదయం స్థానిక తితిదే సమావేశ మందిరానికి రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, వైఎస్ఆర్ జిల్లా ఇంచార్జి మంత్రి ఎస్.సవిత, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా. శ్రీదర్ చెరుకూరి, టిటిడి జెఈవో వీరబ్రహ్మం, కడప, తిరుపతి జిల్లాల ఎస్పీలు అశోక్ కుమార్, హర్షవర్ధన్ రాజు, జేసీ అదితి సింగ్, పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు చేరుకున్నారు.
దేవస్థానం సమీపంలోని శ్రీకోదండరామ స్వామి కల్యాణ వేదిక వద్దకు చేరుకుని… అనంతరం అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. కల్యాణ వేదిక, గ్యాలరీలు, రోడ్లు, బారికేడ్లు, పార్కింగ్, విద్యుత్, ఇతర క్లినింగ్ వంటి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేసి సలహాలు, సూచనలను ఇచ్చారు దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.
అత్యంత చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు.
9వ తేదీ లోపు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయాలని, శాఖల వారీగా కేటాయించిన పనులపై.. సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలను, ఆదేశాలను జారీ చేశారు. శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవంగా జరిగే కళ్యాణోత్సవ ఘటాన్ని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా, సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
