రాష్ట్రంలో 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం పాలన కొనసాగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆకాంక్షించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా రహదారి పనులకి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం డుంబ్రిగూడ బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాష్ట్రానికి మేలు చేసేలా సీఎం చంద్రబాబు ఆలోచనలు ఉంటాయన్నారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చేయాలని.. అదే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో మొత్తం 90 కిలోమీటర్లు రోడ్లు వేస్తే.. కూటమి ప్రభుత్వం 8 నెలల్లో 1069 కిలోమీటర్లు రోడ్లు వేశామని తెలిపారు.
రాష్ట్రం మొత్తం 3,700 గ్రామాలు ఉంటే, ఇంకా 1177 ఆవాసాలకు రోడ్లు వేయాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.400 కోట్లు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. గిరిజన ప్రాంతంలో యువత గంజాయి వ్యసనానికి లోనూ అవ్వద్దని విజ్ఞప్తి చేశారు. గిరిజనులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని హామీ ఇచ్చారు. దేశం మొత్తం పర్యాటకులను ఆకర్షించేలా అరకు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.