మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రామగిరి పర్యటనకు కనీస భద్రతను కల్పించడంతో కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించిందని మాజీ చీఫ్‌విప్, వైసీపీ నాయకుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు హోంమంత్రి స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్‌ప్లస్ కేటగిరి భద్రత ఉన్న నాయకుడి విషయంలో తాము చేసిన దుర్మార్గాన్ని సమర్థించుకుంటూ హోంమంత్రి, పోలీసు సంఘాలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇంకా ఆయనేమన్నారంటే…
దేశంలోనే అత్యంత ప్రజాధరణ ఉన్న వైయస్ జగన్ భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం కక్షసాధింపుతో వ్యవహరిస్తోంది. అనంతపురం జిల్లా పాపిరెడ్డిపల్లిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నాయకుడి హత్యతో ఆ కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు వైయస్ జగన్ రెండు రోజుల ముందుగానే ప్రభుత్వానికి, పోలీసులకు సమాచారం ఇచ్చి అక్కడికి వెళ్లారు. అక్కడ ఆయన హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యే ప్రాంతంలో కనీసం పదిమంది పోలీసులు కూడా భద్రతలో లేరు. వందలాది మంది జనం వైయస్ జగన్ హెలికాఫ్టర్ ఇంకా ఆగిపోకముందే, రెక్కలు రొటేట్ అవుతుండగానే హెలికాఫ్టర్‌ను చుట్టుమట్టారు. ఈ క్రమంలో ఆయన కనీసం హెలికాఫ్టర్ నుంచి కిందికి దిగేందుకే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. చివరికి జనం కారణంగా విండ్‌షీల్ట్ దెబ్బతింది. అటువంటి స్థితిలో అదే హెలికాఫ్టర్‌లో వీఐపీని తీసుకుని ట్రావెల్ చేయడం నిబంధనలకు విరుద్దమని పైలెట్ తేల్చి చెప్పారు. చివరికి వైయస్ జగన్ రోడ్డు మార్గంలో తిరిగి రావాల్సి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల భద్రతా వైఫల్యం చాలా స్పష్టంగ కనిపిస్తోంది. దీనిని వక్రీకరించేలా హోంమంత్రి మాట్లాడుతున్నారు.
భద్రతపై హోంమంత్రి అబద్దాలు
వైయస్ జగన్ పర్యటనకు పూర్తి భద్రత కల్పించామంటూ హోంమంత్రి అనిత చెబుతున్నవి పచ్చి అబద్దాలు. హెలిప్యాడ్‌లో రెండు వందల మంది పోలీసులు, మొత్తం పర్యటనలో పదకొండు వందల మంది పోలీసులు డ్యూటీలో ఉన్నారని ఆమె చెబుతున్నారు. నిజంగా అంతమంది ఉంటే హెలిప్యాడ్‌లోకి వందలాది జనం ఎలా దూసుకువచ్చారు? వారిని ఎందుకు నియంత్రించలేకపోయారు? ముందునుంచే హెలిప్యాడ్ పోలీసుల నియంత్రణలో లేదా? వీటికి సమాధానం చెప్పగలరా? పదకొండు వందల మంది పోలీసులే ఉంటే, వైయస్ జగన్ గారు రోడ్డు మార్గంలో ఎందుకు తిరుగు ప్రయాణం చేయాల్సి వచ్చింది? కూటమి ప్రభుత్వం డ్యూటీలో ఉన్నారంటున్న పోలీసులు వైయస్ జగన్ పర్యటనకు వస్తున్న వారిని బారికేట్లను ఏర్పాటు చేసి వారిని రానివ్వకుండా చేసేందుకే పనిచేశారు తప్ప ఒక జెడ్‌ప్లస్ కేటగిరి ఉన్న నాయకుడి భద్రత కోసం పనిచేయలేదు. దీనిని కప్పిపుచ్చుకునేందుకు హోంమంత్రి అనిత మాట్లాడుతూ వైయస్ జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే, ఆయన క్రిమినల్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మేం కూడా సంమయనం కోల్పోయి చంద్రబాబును క్రిమినల్ అని అనడానికి ఎంతో సమయం పట్టదు. మల్లెల బాబ్జీ, పింగళి దశరథరామ్ హంతకులు ఎవరూ అని ప్రశ్నించడానికి కూడా సమయం పట్టదు. కానీ వారిలా మేం విజ్ఞత మరిచి స్థాయిని మరిచి అనుచితంగా మాట్లాడం.
ఒత్తిళ్ళతో పోలీస్ వ్యవస్థ గౌరవాన్ని దిగజార్చవద్దు
పోలీసులపై వైయస్ జగన్ పరుషంగా మాట్లాడారని పోలీస్ సంఘాలు అంటున్నాయి. వైయస్ఆర్‌సీపీకి చెందిన వారిపైన దాడులు చేస్తూ, ప్రాణాలు తీస్తున్నా, పోలీసులు ఎందుకు దానిపై చర్యలు తీసుకోవడం లేదు? చట్టబద్దంగా పనిచేసే పోలీసులు, అధికారులను వైయస్ఆర్‌సీపీ ఎప్పుడూ గౌరవిస్తుంది. చట్టానికి వ్యతిరేకంగా, కూటమి పార్టీల కోసమే పనిచేసే వారిపైన మాత్రమే మేం వ్యతిరేక వ్యాఖ్యలు చేశాం. వైయస్ జగన్ గారు కూడా ఇదే విషయం చెప్పారు. పోలీస్ విధుల్లో ఉండి కూడా చట్టప్రకారం వ్యవహరించకుండా అరాచకాలను ప్రోత్సహించే వారు యూనిఫాం వేసుకోవడానికి అనర్హులు. వారి నుంచి యూనిఫాంను తొలగింపచేస్తానని వైయస్ జగన్ అన్నారు. దీనిని కొన్ని పోలీస్ సంఘాలు తప్పుబట్టడం సరికాదు. పోలీసులు చట్టానికి బద్దులై వ్యవహరించాలే తప్ప, ఎవరి ఒత్తిళ్ళకోసమో, స్వలాభం కోసమో లొంగిపోయి పోలీస్ వ్యవస్థనే దిగజార్చేవారికి అండగా నిలబడటం సమంజసం కాదు. రెడ్‌బుక్ రాజ్యాంగంను అమలు చేస్తున్న వారి కోసం పనిచేసే వారికి మద్దుత పలికితే ప్రజాస్వామ్యంకే అర్థం ఉండదు. పోలీస్ అధికారులను కూడా రెబ్‌బుక్ రాజ్యాంగం పరిధిలోకి తీసుకువచ్చి, వారిని ఏ రకంగా వేధిస్తున్నారో పోలీస్ యంత్రాంగానికి తెలుసు. అటువంటి వారికి పోలీసు సంఘాలు అండగా నిలవాలి, వారిపై వేధింపులను ప్రశ్నించాలి.
పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి సర్కార్ పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. పోలీసులను చట్ట ప్రకారం కాకుండా, తమ స్వప్రయోజనాల కోసం పనిచేసే వ్యవస్థగా మార్చేస్తోంది. ఈ పదినెలల్లోనే ఎంత మంది పోలీస్ అధికారులను ఎలా వేధించిందో ప్రభుత్వమే శాసనమండలిలో అధికారిక లెక్కలతో తమ ఘనతను చాటుకుంది. ముగ్గురు డీజీ స్థాయి అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్‌కుమార్, సంజయ్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధిస్తున్నారు. నలుగురు ఐపీఎస్ అఫీసర్లు, కొల్లి రఘురాంరెడ్డి, రవిశంకర్‌రెడ్డి, పి.జాషువ, వృషబ్‌రెడ్డి లను వేధింపుల్లో భాగంగా పోస్టింగ్‌లు ఇవ్వలేదు. సివిల్ ఎస్సీలు సత్తిబాబు, వెంకటరత్నం, లక్ష్మీనారాయణ, సురేష్‌బాబులకు కూడా పోస్టింగ్‌లు ఇవ్వలేదు. ఏపీఎస్సీ కమాడెంట్ సాయిప్రసాద్, ఇరవై మంది అడిషనల్ ఎస్పీలు, 40 మందికి పైగా డీఎస్పీలు, 120 మంది సీఐలకు ఇంకా పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధిస్తున్నారు. మొత్తం రెండు వందల మందిని వేధింపుల్లో భాగంగా వీఆర్‌లో పెట్టి పోస్టింగ్‌లు ఇవ్వలేదు. వీరి గురించి పోలీసు సంఘాలు ఎందుకు మాట్లాడటం లేదు? ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను తీసుకువచ్చి, వారికి వీక్ ఆఫ్‌లు కల్పించాలని ఆలోచించిన నాయకుడు వైయస్ జగన్. పోలీసుల పట్ల ఎంతో సానుభూతితో పనిచేసిన సీఎం వైయస్ జగన్. దానికి భిన్నంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నా ఒక్కరు కూడా దీనిపై మాట్లాడటం సరికాదు.
వైయస్ జగన్ భద్రతపై ఆది నుంచి నిర్లక్ష్యమే
దేశంలో ప్రజాధరణ కలిగిన నాయకుడిగా, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న వైయస్ జగన్ కు భద్రత విషయంలో లోపాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీని అణగదొక్కాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఒక మాజీ ముఖ్యమంత్రికి కల్పించాల్సిన భద్రతను ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది. గతంలోనే వైయస్ జగన్ పై రెండు పర్యాయాలు దాడి జరిగింది. రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేసిన సందర్భంలో తెలుగుదేశం ప్రభుత్వం అనేక ఆటంకాలు కల్పించింది. తేనెటీగలను ఉసికొల్పడం వంచి దిగజారుడు చర్యలకు పాల్పడింది. ఈ రోజు వైయస్ జగన్ కు జెడ్‌ప్లస్ కేటగిరి భద్రత ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అటువంటప్పుడు రాష్ట్రంలో ఆయన పర్యటిస్తున్నప్పుడు కనీస భద్రతను కూడా ఎందుకు కల్పించడం లేదు. ఇటీవల గుంటూరు మిర్చియార్డ్ లోనూ పూర్తిగా భద్రతను పట్టించుకోకుండా వదిలేయడంతో పార్టీ కార్యకర్తలే ఆయనకు రక్షణగా నిలబడ్డారు. నిన్న అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా పోలీసులు ఇదే తరహాలో వ్యవహరించారు. వైయస్ జగన్‌కు ప్రజాధరణ పెరుగుతోంది, భవిష్యత్తులో రాజకీయంగా తమకు ఇబ్బంది కలిగిస్తాడనే ఉద్దేశంతో ఆయనను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉంది. మాజీ సీఎంగా ఉన్న చంద్రబాబుకు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం పూర్తి భద్రతను కల్పించింది. జెడ్‌ప్లస్ కేటగిరితో నిత్యం ఆయనకు పూర్తి రక్షణ ఉండేలా చర్యలు తీసుకుంది. కానీ వైయస్ జగన్ విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం కక్షసాధింపుతో వ్యవహరిస్తోంది. పార్టీ కార్యకర్తల ముసుగులో బయటి వ్యక్తులు వచ్చి, ఏదైనా చేయకూడని పనులు చేస్తే దీనికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? వైయస్ జగన్ ఇంటి వద్ద ఉండాల్సిన భద్రతను కూడా నామమాత్రంగా మార్చేశారు. ఆకతాయిలు ఇంటి ముందుకు వచ్చి వీడియోలు తీసి, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్‌లు పెడుతున్నారంటే ఈ ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను అర్ధం చేసుకోవచ్చు. గతంలో అనధికారిక నివాసంలో ఉంటున్నా, వరదల సమయంలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినా కూడా చంద్రబాబు నివాసంకు పూర్తి భద్రతను కల్పించింది. విలువలను పాటించాల్సిన అవసరం లేదా? వైయస్ జగన్ ఇంటి వద్ద ఒక్క కానిస్టేబుల్‌ను కూడా పెట్టకుండా, బయట ఆయన పర్యటన సందర్భంలోనూ భద్రత కల్పించకుండా కావాలనే ఇబ్బందులను సృష్టిస్తున్నారు.
కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం
ఒక మాజీ ముఖ్యమంత్రికి కల్పించాల్సిన భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షసాధింపులపై కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం. న్యాయపరంగా దీనిని ఎదుర్కొంటాం. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగంకు బదులు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మహిళలకు రక్షణ లేని స్థితిలో ఏపీ ఉంది. కొందరు పోలీసులు చట్టాలకు బదులు, రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిని తప్పడు కేసులతో బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారింది