బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్(Shakeel)ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఓ రోడ్డు ప్రమాదం కేసు నుంచి తన కుమారుడిని తప్పించే ప్రయత్నం చేసినందుకు షకీల్‌పై పోలీసులు గతంలోనే అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అయితే అప్పటి నుంచి షకీల్ దుబాయ్ వెళ్లిపోయి అక్కడే ఉంటున్నారు. తాజాగా ఆయన తల్లి మరణించడంతో ఇండియాకు తిరిగొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో శంషాబాద్ విమానాశ్రయంలో దిగగానే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కానీ తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు షకీల్‌కు పోలీసులు అనుమతిచ్చారు. అంత్యక్రియలు పూర్తయ్యాక పోలీస్ స్టేషన్‌కు తరలించనున్నట్లు సమాచారం.
కాగా 2023లో షకీల్ కుమారుడు రహేల్ వేగంగా కారు నడుపుతూ ప్రగతి భవన్ ముందు ప్రమాదం చేశాడు. ఈ కేసుకు సంబంధించి తన కుమారుడిని తప్పించేందుకు షకీల్ పోలీసులను తప్పుదోవ పట్టించారు. వెంటనే కొడుకును దుబాయ్ పంపించేశారు. కొడుకు దుబాయ్ పారిపోయేందుకు షకీల్ సహకరించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ విషయం తెలిసి షకీల్ కూడా దుబాయ్ పారిపోయారు.