ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటతీరు మరింత దిగజారింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన పోరులో (KKR vs CSK) మరోసారి చెన్నై బ్యాటర్లు నిరాశపరిచారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో చెన్నై ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. కానీ ఈ నిర్ణయం కేకేఆర్‌కు పెద్ద లాభాన్ని తెచ్చిపెట్టింది.
స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌పై చెన్నై బ్యాటింగ్ పూర్తిగా తేలిపోయింది. టాప్ ఆర్డర్ నుంచి టైలెండర్లు వరకూ ఎవరూ నిలదొక్కుకోలేకపోయారు. డాన్ కాన్వేను (12) ప్రారంభంలోనే మొయిన్ అలీ ఔట్ చేయడంతో చెన్నై కష్టాలు ప్రారంభమయ్యాయి. తక్కువ స్కోరుకు పరిమితమవుతుందని అప్పటికే స్పష్టమైంది. మిడిలార్డర్‌లో శివమ్ దూబే (31), విజయ్ శంకర్ (29), రాహుల్ త్రిపాఠి (16) మాత్రమే కొంత పోరాటం చేశారు. మిగతావాళ్లంతా ఒత్తిడికి లోనై సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
కేకేఆర్ స్పిన్నర్లు అద్భుతంగా చెలరేగారు. సునీల్ నరైన్ మూడు కీలక వికెట్లు తీశాడు. ఇక వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా రెండేసి వికెట్లు తీసి కేకేఆర్ విజయానికి బాటలు వేశారు. మొయిన్ అలీ, వైభవ్ అరోరా కూడా తలా ఒక వికెట్ తీశారు. ఒకే మ్యాచ్‌లో మొత్తం ఆరు వికెట్లు స్పిన్నర్లు పడగొట్టడం ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచింది. చివరకు చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 103 పరుగులకే పరిమితమైంది. కోల్‌కతా ఈ స్కోర్ ఛేదించడం పెద్ద విషయం కాకపోవచ్చు.