ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు 2025 సంవత్సరానికి చెందిన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వార్షిక పరీక్షల ఫలితాలను ఈరోజు ఉదయం 11 గంటలకు అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు రాసిన సుమారు 10.5 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇక ఈ ఏడాది కూడా ఫలితాల్లో అమ్మాయిలదే ఆధిపత్యం. టాప్ ర్యాంకులన్నీ బాలికలే దక్కించుకోవడం విశేషం. ప్రతీ ఏడాది లాగే వారు తమ ప్రతిభతో మరోసారి చాలారు.
ఇంటర్ బోర్డు ప్రకారం, మార్చి 1 నుంచి 20 వరకు 26 జిల్లాల్లో 1535 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షల్లో మొత్తం 10,58,892 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల అనంతరం కేవలం 20 రోజుల వ్యవధిలోనే మూల్యాంకన ప్రక్రియను పూర్తిచేసి, ఫలితాలను శరవేగంగా విడుదల చేశారు. విద్యార్థులకు ఫలితాలపై ఏవైనా సందేహాలు ఉంటే, త్వరలోనే బోర్డు టోల్ ఫ్రీ నంబర్, ఈమెయిల్ ఐడీలు ప్రకటించనుంది. అలాగే, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునే తేదీలు కూడా ఈరోజే వెల్లడించనున్నారు.
తక్కువ మార్కులు వచ్చినవారు లేదా ఫెయిలైన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIEAP) ప్రకటన విడుదల చేసింది. ప్రధాన పరీక్షల ఫలితాలు వెలువడిన వెంటనే సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది.
సప్లిమెంటరీ పరీక్షలు మే 2025లో నిర్వహిస్తారు. ఈ పరీక్షలు ప్రధానంగా ఫెయిల్ అయిన విద్యార్థులకు ఒక ముఖ్యమైన అవకాశం. వారు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా తమ విద్యా సంవత్సరాన్ని కాపాడుకోవచ్చు. BIEAP త్వరలోనే ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ 2025ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతుంది. విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ను ప్రారంభించడానికి వీలుగా ఈ షెడ్యూల్‌ను వీలైనంత త్వరగా విడుదల చేయనున్నారు.
సప్లిమెంటరీ పరీక్షల కోసం దరఖాస్తు ప్రక్రియ, ఇతర వివరాలు టైమ్ టేబుల్‌తో పాటు కొద్ది రోజుల తర్వాత విడుదల చేస్తారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్లు, ఇతర సంబంధిత వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ పరీక్షల గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం BIEAP అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా సందర్శించడం మంచిది.