తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ(SC classification) అమలు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవో తొలి కాపీని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) అందజేశారు. అనంతరం సచివాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రులు మాట్లాడారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రెండు గంటల్లోనే వర్గీకరణ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. వర్గీకరణ అమలు కోసం సీఎం కేబినెట్ సబ్ కమిటీ వేశారని, వర్గీకరణ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి అధ్యయనాలు చేశామని తెలిపారు. వర్గీకరణ కోసం జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని పార్టీలు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపాయని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ తర్వాతే ఉద్యోగాలకు నోటిఫికేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చామని.. నేటి నుంచి ఉద్యోగ, విద్యా అవకాశాల్లో వర్గీకరణ అమలు చేయడం జరుగుతుందన్నారు.
ఇక మరో మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. 30ఏళ్లుగా హక్కుల కోసం చేసిన పోరాటాలకు ఫలితం దక్కిందన్నారు. నేటి నుంచి రిజర్వేషన్లు అమలు కానున్నాయని.. రేపు ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే అంశంపై సబ్ కమిటీ సమావేశం ఉందని చెప్పారు. విద్య, ఉద్యోగాల్లో ఇకపై ఇచ్చే నోటిఫికేషన్లకు వర్గీకరణ అమలవుతుందన్నారు. భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని రాజనర్సిహ వెల్లడించారు.