‘నేషనల్ హెరాల్డ్’ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi) పేర్లను ఈడీ ఛార్జీషీట్‌లో చేర్చడం తీవ్ర దుమారం రేపుతోంది. సోనియా, రాహుల్‌తో పాటు మరో ఇద్దరిపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో అధికారులు ప్రాసిక్యూషన్ కంప్లయింట్ దాఖలు చేశారు. ఈ ఫిర్యాదుపై ఢిల్లీ స్పెషల్ కోర్టు ఈనెల 25న విచారణ చేపట్టనుంది. దీంతో ఈడీ వైఖరిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు సిద్ధమైంది. ఇవాళ అన్ని రాష్ట్రాల్లోని ఈడీ కార్యాలయాల ఎదుట ధర్నాకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులకు కీలక పిలుపునిచ్చారు. రేపు(గురువారం) ఉదయం 10 గంటలకు ఈడీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగబోతున్నట్లుగా ప్రకటించారు. ఛార్జిషీట్లలో సోనియా, రాహుల్ పేర్లను కక్షపూరితంగా చేర్చారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలిపారు.