తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) హీరోగా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) మేకర్స్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు, మ్యాస్ట్రో ఇళయరాజా (Ilaiyaraaja) లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. గతంలో తాను సంగీతం అందించిన మూడు గీతాలను ఈ మూవీలో అనుమతి లేకుండా రీక్రియేట్ చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందుకు రూ.5 కోట్ల పరిహారం డిమాండ్ చేశారు. అంతేకాకుండా వెంటనే సినిమాలో ఆ పాటలను తొలగించి మేకర్స్ క్షమాపణ చెప్పాలని కోరారు.
తాజాగా ఈ నోటీసులపై నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. ఆయా పాటలను వినియోగించే ముందు ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ తీసుకున్నామని చిత్ర నిర్మాతల్లో ఒకరైన యలమంచిలి రవిశంకర్ తెలిపారు. సినిమాలో ఉపయోగించిన అన్ని పాటలకు మ్యూజిక్ కంపెనీల నుంచి పర్మిషన్ తీసుకున్నామని పేర్కొన్నారు. చట్టప్రకారమే ముందుకు పోయామని స్పష్టం చేశారు. కాగా దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ కామెడీ మూవీ ఈ నెల 10న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తెచ్చుకుని రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా నటించగా.. యోగిబాబు, రాహుల్ దేవ్, అర్జున్ దాస్, సునీల్, ప్రభు కీలక పాత్రల్లో నటించారు.