తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల మేలు కోసం కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. భూ సంబంధిత వ్యవహారాలను సులభతరం చేయడానికి, భూమిపై హక్కుల్ని క్లియర్ చేయడానికి “భూ భారతి” అనే పేరుతో ఈ పథకం రూపొందించారు. ఇది భూముల రిజిస్ట్రేషన్, రికార్డుల నవీకరణ, భూముల వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఉపయోగపడనుంది. రైతులు తమ భూమిపై పూర్తి హక్కు పొందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఈ పథకం వల్ల భూమి రికార్డులు పూర్తిగా డిజిటల్ అవుతాయి. భూముల సరిహద్దులు, యాజమాన్య వివరాలు ఖచ్చితంగా నమోదు అవుతాయి. భవిష్యత్తులో భూమి సంబంధిత వివాదాలు తగ్గిపోతాయని ప్రభుత్వం చెబుతోంది. భూమిని ఎలా ఉపయోగించాలి, పర్యావరణాన్ని ఎలా కాపాడాలి అన్న అంశాలపై కూడా ఈ కార్యక్రమం ద్వారా అవగాహన పెంచనున్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా కొన్ని మండలాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలోని ఖాజీపురం గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు మొదలవుతోంది. మద్దూర్ మండలంలో జరగనున్న కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు.
వికారాబాద్ జిల్లా పుడూరు గ్రామంలో జరగనున్న అవగాహన కార్యక్రమంలో కూడా మంత్రి పాల్గొంటారు. భూ భారతి చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏప్రిల్ 17 నుంచి జూన్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, రెవెన్యూ అధికారులు పాల్గొంటారు. ఈ కార్యక్రమం రైతులకు భూమిపై ఉన్న అనిశ్చితి తొలగించి, పటిష్టమైన భూమి వ్యవస్థను ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.