కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ త్వరలో అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 21, 22 తేదీల్లో ఆయన బ్రౌన్ యూనివర్శిటీలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా అక్కడి అధ్యాపకులు, విద్యార్థులతో సంభాషించనున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారం కాంగ్రెస్ ప్రచార విభాగాధిపతి పవన్ ఖేరా వెల్లడించారు. రెండు రోజుల పాటు రాహుల్ అమెరికాలో పర్యటిస్తారని, పర్యటనలో భాగంగా ఎన్నారైలు, కాంగ్రెస్ విదేశీ విభాగం సభ్యులతో కూడా సమావేశమవుతారని తెలిపారు.
అయితే, నేషనల్ హెరాల్డ్ కేసు విచారణకు ఢిల్లీ ప్రత్యేక కోర్టు సిద్ధమవుతున్న వేళ రాహుల్ గాంధీ అమెరికా పర్యటన చేపట్టడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఆయన బావ రాబర్ట్ వాద్రా మనీలాండరింగ్ కేసులో ఈడీ ప్రశ్నలకు మూడు రోజులుగా సమాధానాలు ఇస్తున్నారు. తనపై జరుగుతున్న విచారణ వెనుక రాజకీయ కక్షలున్నాయని వాద్రా ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాహుల్ పర్యటన ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.