తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు విడుదల కాగా, ఇప్పుడు తెలంగాణ ఫలితాలపై దృష్టి కేంద్రీకరించింది. తాజా సమాచారం మేరకు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ 18న విడుదలయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరిగాయి. మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 5 నుంచి 24 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 6 నుంచి 25 వరకు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 9,96,971 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల అనంతరం మదింపు ప్రక్రియ, రెండవసారి వెరిఫికేషన్, మార్కుల కంప్యూటరైజేషన్ తదితర పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఫలితాల విడుదలకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు తెలుస్తోంది.
ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్లు tsbie.cgg.gov.in, results.cgg.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీ నమోదు చేసిన తర్వాత ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. అలాగే, మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే ముగియడంతో, ఫలితాల విడుదల కూడా ఆలస్యం కాకుండా జరిగే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఏప్రిల్ 18న అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.