నటి అభినయ వివాహం బుధవారం ఘనంగా జరిగింది. తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ గుర్తింపు పొందిన అభినయ.. వేగేశ్ కార్తీక్‌తో పెళ్లి పీటలెక్కారు. చిరకాల మిత్రుడైన వేగేశ్‌తో గత నెల మార్చి 9న నిశ్చితార్థం జరగ్గా, ఏప్రిల్ 16న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో వైభవంగా వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
పెళ్లి వేడుకలోని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభినయ ఇన్‌స్టాగ్రామ్‌లోనూ వివాహనానికి సంబంధించి.. కొన్ని ఫోటోలు, వీడియోలను పంచుకుంది.
మహెందీ కార్యక్రమానికి సంబంధించిన చిత్రాలను అభిమానులతో పంచుకుంది. నెటిజన్లు అభినయకు శుభాకాంక్షలు చెబుతూ తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.
మూగ, చెవుడైనప్పటికీ అభినయ తన అభినయంతో సినీ ప్రేక్షకులను మెప్పించింది. హావభావాల ద్వారా పాత్రలో లీనమై తనదైన శైలిలో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన అభినయ ప్రస్తుతం కథానాయికగా కూడా అవకాశాలు పొందుతోంది. ఆమె ప్రతిభకి శారీరక వైకల్యం అడ్డుకాదు అని నిరూపించింది.
అభినయ ‘నేనింతే’తో టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. అనంతరం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో మహేష్ బాబు, వెంకటేష్ లకు చెల్లిగా చేసిన పాత్ర ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే ‘శంభో శివ శంభో’, ‘దమ్ము’, ‘ఢమరుకం’, ‘జీనియస్’, ‘ధృవ’, ‘సీతా రామం’, ‘ది ఫ్యామిలీ స్టార్’ వంటి ఎన్నో తెలుగు సినిమాల్లో నటించింది. ఇటీవల మలయాళంలో వచ్చిన ‘పని’ చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.