విశాఖ నుంచి అమరావతి రావాలంటే హైదరాబాద్ మీదుగా తిరిగి రావాల్సి వస్తోందని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయన ట్వీట్‌పై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. విశాఖ నుంచి కొన్ని సాంకేతిక కారణాలతో ఆగిపోయిన అన్ని దేశీయ, విదేశీ విమాన సర్వీసులను నెల రోజుల్లోపు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఏపీలోని ప్రతి విమానాశ్రయానికి కనెక్టివిటీ పెంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రామ్మోహన్ నాయుడు ప్రకటన పట్ల గంటా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు.
“థాంక్యూ వెరీ మచ్ రామ్మోహన్ నాయుడు.. సాంకేతిక కారణాలతో విశాఖ నుంచి ఆగిపోయిన అన్ని దేశీయ, విదేశీ విమానాలను నెలరోజుల్లోపు పునరుద్ధరిస్తామని, దీనిపై విమాన నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్న మీ ప్రకటన విశాఖ విమాన ప్రయాణికుల్లో ఆనందం నింపింది. మీ చొరవతో ఐటీ, టూరిజం, ఫార్మా తదితర కీలక రంగాల్లో వ్యాపార కార్యకలాపాలకు ఊతమిచ్చేలా భవిష్యత్ లో ఎయిర్ కనెక్టివిటీ పెరగాలని, కొత్త సర్వీసులు ప్రవేశపెట్టాలని ఆశిస్తున్నాం” పేర్కొన్నారు.